3 September, 2026 | 5:07 AM

సభకే రాడు.. ప్రతిపక్ష హోదా ఎందుకు?

03-09-2026 | 03:05am
  1. కేసీఆర్ రాజీనామా చేసి గౌరవం నిలబెట్టుకోవాలి  
  2. వెయ్యి రోజుల మా కాంగ్రెస్ పాలన సూపర్ హిట్ 
  3. ఆర్థిక ఇబ్బందుల్లోనూ రాష్ట్రంలో సుపరిపాలన  
  4. బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క రేషన్‌కార్డునా ఇచ్చారా?
  5. కేసీఆర్, హరీష్‌రావు వేల కోట్లు ఎలా సంపాదించారు
  6. కేటీఆర్ హద్దు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరు
  7. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): గతంలో తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల భారీ అప్పుల ఊబిలోకి నెట్టినా, ఆర్థిక ఇబ్బందులను సమర్థవంతంగా అధిగమించి కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (State Minister Ponguleti Srinivas Reddy) స్పష్టంచేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన సూపర్ హిట్‌గా నిలిచిందని పేర్కొన్నారు. తమ వెయ్యి రోజుల పరిపాలన అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా సాగుతోందని మంత్రి పొంగులేటి అన్నారు. కేవలం మాటల గారడీతో, యాస, ప్రాసలతో ప్రజలను మభ్య పెట్టే అలవాటు తమకు లేదన్నారు. ‘కేసీఆర్ వెయ్యి రోజుల్లో రూ.22 కోట్ల ప్రజల సొమ్మును జీతభత్యాల రూపంలో పొందారు. రూ.22 కోట్లు తీసుకుని ఒక్కసారైనా అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడారా.. ? ప్రతిపక్షనేత హోదాలో ఉండే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదు.

ప్రతిపక్షనేత, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గౌరవం నిలబెట్టుకోవాలి. ప్రజల కష్టాల గురించి ఏనాడు మాట్లాడని వ్యక్తికి ప్రతిపక్షనేత హోదా ఎందుకు’ అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. బుధవారం సచివాలయంలో సహచర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

గత బీఆర్‌ఎస్ సర్కార్ ధనిక రాష్ట్రాన్ని అప్పులమయంగా అప్పజెప్పినా, ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు. ఈ వెయ్యి రోజుల పాలనలో ఏకంగా రూ.1.76 లక్షల కోట్లను ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందించామని వెల్లడించారు. వరుస ఎన్నికల్లో ఓడినా బీఆర్‌ఎస్ నాయకులకు జ్ఞానోదయం కాలేదని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో పేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు.

కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ హద్దు మీరి మాట్లాడితే ప్రజలు మళ్లీ క్షమించే అవకాశం లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ  విషయంలో కేటీఆర్ సంస్కారహీనంగా మాట్లాడారని మంత్రి మండిపడ్డారు. రైతును రాజును చేసేలా పరిపాలన.. 

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, రైతును రాజును చేసేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. రైతుల కోసం ఇప్పటివరకు రూ.1.74 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.  వరి వేస్తే ఉరేనని ఆనాటి దొర కేసీఆర్ అన్నారని, తమ ప్రభుత్వం రాగానే వరి క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తున్నామన్నారు.

రుణమాఫీ, రైతు భరోసా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను సైతం తాము చిత్తశుద్ధితో కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు సర్పంచ్‌లకు బకాయి పడ్డ సుమారు రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులను సైతం తమ ప్రభుత్వమే బాధ్యతగా చెల్లిస్తోందని పొంగులేటి   

ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తున్నాం..

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు రేషన్‌కార్డులు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపే కొత్తగా 15 లక్షల రేషన్‌కార్డులు ఇచ్చిందని మంత్రి పొంగులేటి తెలిపారు. కొత్తగా దాదాపు 3 లక్షల మంది వితంతువులు, వృద్ధులకు పింఛన్లు ఇవ్వనున్నామని అన్నారు.

కేసీఆర్ భద్రాచలం అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎన్నికల అజెండాలో పెట్టిన అంశాలను ఒక్కొక్కటి అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి జనాలు కనిపించని 30 నుంచి -40 కి.మీ. దూరంలో నిర్మించారని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం జనావాసాల మధ్య, ఖరీదైన ప్రాంతాల్లో ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తోందని తెలిపారు.

కవిత ప్రశ్నలకు హరీష్‌రావు సమాధానాలు చెప్పాలి..

ధరణి వల్ల కలిగిన నష్టాలను భూభారతి పోర్టల్‌తో సరిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు. 22ఏ వల్ల నిజమైన లబ్ధిదారులకు నష్టం జరగకుండా చూస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ భూములను పొరుగు రాష్ట్ర రాజులకు కట్టబెట్టింది బీఆర్‌ఎస్ పాలకులేనని మంత్రి ఆరోపించారు. హరీష్‌రావుకు చిత్తశుద్ధి ఉంటే కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయని వాళ్లు ఇతరులకు న్యాయం చేస్తారా?

కేసీఆర్, హరీష్‌రావు కుటుంబం ఏం వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించారు? అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఖాతాలో ఉన్నంత డబ్బు దేశంలో ఏ పార్టీకి లేదన్నారు. దేశంలో జరిగే ఎన్నికల ఖర్చు మొత్తం భరిస్తానని కేసీఆర్ అన్నారని, అంత డబ్బు కేసీఆర్ దగ్గర ఎక్కడిదని, అన్ని విరాళాలు ఎవరు ఇచ్చారు?, ఎందుకు ఇచ్చారు? అని మంత్రి నిలదీశారు.