2 September, 2026 | 8:33 PM

Breaking News

గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •   ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది రేవంత్ రెడ్డి.. ఖబర్దార్   •   ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కరించాలని డిఎంహెచ్వోకు వినతిపత్రం   •  

పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!

02-09-2026 | 07:47pm

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Rajagopal Reddy) చేసిన తాజా వ్యాఖ్యలు  పార్టీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్(Congressd) సిద్ధాంతాలను నమ్ముకుని పనిచేస్తున్న అసలైన నేతలను పక్కనబెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన కొందరు నేతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు.


“మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే బయటకు పంపించాలని చూస్తున్నారు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలు కొందరు వలస నేతలతో పాటు కేబినెట్‌లోని కీలక నేతలను ఉద్దేశించే చేసినవేనన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఢిల్లీ(Delhi) స్థాయికి చేరిన సమయంలో రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.


తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని చెబుతూనే.. సమయం వచ్చినప్పుడు పదవులే తనను వెతుక్కుంటూ వస్తాయని రాజగోపాల్‌రెడ్డి(Rajagopal Reddy) ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాను ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించడం ఖాయమని స్పష్టం చేశారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.


అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరే సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చిందని రాజగోపాల్‌రెడ్డి గతంలోనే పలుమార్లు ప్రస్తావించారు. అయితే ఆ హామీ అమలు కాకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తాజా వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.


పదవుల కంటే రాజకీయాల్లో, ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు రావడమే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. పేద ప్రజల సమస్యలను విస్మరించి వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చే రాజకీయ సంస్కృతిలో మార్పు రావాలని అన్నారు. అభివృద్ధి పనులు నిలిచిపోతే వాటిపై తాను గళం విప్పుతూనే ఉంటానని స్పష్టం చేశారు.



రాజగోపాల్‌రెడ్డి తాజా వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్‌లో పాత నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమైనట్లయింది. ఆయన వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.