22 April, 2026 | 2:42 AM

2.50 కోట్ల హాష్ ఆయిల్ స్వాధీనం

22-04-2026 01:11 AM
  1. స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా
  2. డ్రగ్ కంట్రోల్, క్యాట్‌పార్టీ, ఇంతేజార్గంజ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్
  3. వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్ పరిసరాల్లో నిందితుల అరెస్ట్
  4. వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్

మహబూబాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంలో ఎప్పుడు లేనివిధంగా తొలిసారిగా భారీ స్థాయిలో హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాలోని నలుగురు సభ్యులను వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్‌పార్టీ, ఇంతేజార్గంజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి  సుమారు రూ. 2.50 కోట్ల విలువైన హాష్ ఆయిల్‌తోపాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకు న్నారు.

అరెస్టు చేసిన వారిలో ఒడిషాకు చెందిన హంటల్ సన్ను, హంటల్ సన్యాసి, హంటెల్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కండెల చిన్నబాబులుండగా, కిలో పాండు అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. పట్టుబడిన నిందితులందరూ పరిచయస్తులు. ప్రధాన నిందితుడు హంటల్ సన్ను తన స్వగ్రామంలో గంజాయి మొక్కలను పెంచుతూ వాటిని మిగితా నిందితుల ద్వారా విక్రయించి సోమ్ము చేసుకొని జల్సా చేసేవాడని చెప్పారు.

నిందితులకు గంజాయి విక్రయాలతో వచ్చే డబ్బు జల్సాలకు సరిపోకపోవడంతో హాష్ అయిల్‌ను తయారు చేయాలని కిలో పాండు నిర్ణయించాడు. మిగతా నిందితులకు కిలో పాండు పరిచయం కావడంతో అతడిచ్చిన సూచనల మేరకు గంజాయి మొక్కల పెంపకం చేపట్టి హాష్ ఆయిల్‌ను తయారు చేశారు. వీటిని ముంబైలో విక్రయించాలని భావించారు. ఏపీలోని తుని రైల్వేస్టేషన్ నుంచి ఈ నెల 19వ తేదీన కోణార్క్ రైలులో బయలుదేరారు.

రైలులో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అనుమానం రావడంతో వరంగల్ రైల్వే స్టేషన్‌లో సోమవారం దిగిపోయారు. మంగళవారం ఉదయం ముంబై వేళ్ళేందుకు ముఠా సభ్యులు వరంగల్ బస్టాండ్ వద్ద వున్న రైల్వే గూడ్స్ షెడ్ పరిసరాల్లో అనుమాస్పదంగా తచ్చాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 20 కిలోల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

వీరిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, వరంగల్ ఏఎస్పీ శుభం, ఏసీపీలు జితేందర్ రెడ్డి, జానీ నర్సింహులు, డ్రగ్ కంట్రోల్ టీం ఇన్స్‌పెక్టర్ వై.సతీష్, ఇంతేజార్గంజ్ ఇన్స్‌పెక్టర్ షుకూర్, ఎస్.ఐలు సందీప్, తేజ, ఆర్.ఎస్.ఐలు ఏ.పూర్ణ చందర్ రెడ్డి, కె.మనోజ్ రెడ్డి, ఎల్.లింగారావు, క్యాట్ పార్టీ ఏ.ఆర్.ఏ.ఎస్.ఐలు వి.సుబ్బిరామి రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్ళు బాలరాజు, కె.శ్రీరాములు, యం.డి రబ్బానీ, ఆర్.రాజ్‌కుమార్‌తోపాటు సిబ్బందిని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభి నందించారు.