మగాళ్ల కోసం హ్యాపీ జర్నీ
ఓ హార్ట్ వార్మింగ్ ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘హ్యాపీ జర్నీ’. అభిరామ్ నాయుడు దర్శకత్వంలో గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాలను ప్రధానంగా చూపించే ఈ చిత్రంలో అన్నపూర్ణ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రల్లో పోషిస్తుండగా, పృథ్వీ దండమూడి, వంశీధర్‌గౌడ్, రవి శివతేజ పైలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నటి అన్నపూర్ణ మాట్లాడుతూ.. “ఇది చాలా మంచి కథ. మనందరి కథ.
మనందరికీ ఎన్నో కథలు, భావోద్వేగాలుంటాయి. ఇంట్లో మన వాళ్లను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నామో చెప్పే నిర్వచనం కూడా ఈ సినిమాలో ఉంది” అన్నారు. దర్శకుడు అభిరామ్ నాయుడు మాట్లాడుతూ.. “ఈ టీజర్ చూస్తే ఇది అమ్మాయిల కోసం తీసిన సినిమా అనిపించొచ్చు. కానీ నిజానికిది మగాళ్ల కోసం తీసిన సినిమా. మహిళలు బయటకు చెప్పలేని ఎన్నో భావోద్వేగాలను ఇందులో చూపించాం” అని తెలిపారు. ‘టీజర్ కంటే సినిమా పది రెట్లు అద్భుతంగా ఉంటుంద’ని సహ నిర్మాత తరుణ్‌రెడ్డి చెప్పారు. ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.






