ప్రభుత్వ సలహాదారుగా హనుమంతరావు
- రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్‌రెడ్డి
- వీహెచ్‌కు నెలకు లక్ష, శివధర్‌రెడ్డికి 2.25లక్షల వేతనం.. ఇతర అలవెన్స్‌లు
- భద్రతాసలహాదారుగా మూడేళ్ల కాలపరిమితి
- ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ రామకృష్ణారావు
- నా జీతం మొత్తం పేద విద్యార్థులకు ఇచ్చేస్తా : వీహెచ్
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావుకు, సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ శివధర్‌రెడ్డిలకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. వీ హనుమంతరావును మంత్రి హోదాతో బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా నియమించగా, శివధర్‌రెడ్డిని భద్రతా సలహాదారుగా నియమించారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే నా నెల జీతం మొత్తం రెండేళ్లపాటు పేద విద్యార్థుల చదువులకు ఇచ్చేస్తానని వీహెచ్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సలహాదారు పదవిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడంతో వీ హనుమంత రావుకు నెలకు రూ.1,00,000 వేతనం వస్తుంది. ఒకవేళ ప్రభుత్వ క్వార్టర్ కేటాయించని పక్షంలో, నెలకు రూ.50,000 ఇంటి అద్దె పొందే వీలును కల్పించింది. విధి నిర్వహణలో సొంత వాహనాన్ని ఉపయోగిస్తే నెలకు రూ.30,000 కన్వేయన్స్ అలవెన్స్‌తోపాటు, రూ.15,000 ఇంధన ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది.
దీనికి అదనంగా, డ్రైవర్‌తో కూడిన ప్రభుత్వ వాహనాన్ని పొందే వెసులుబాటు కూడా ఆయనకు ఉంటుంది. అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులతో సమానంగా వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కూడా వర్తిస్తుంది. బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారు కార్యకలాపాల నిర్వహణ కోసం బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక సిబ్బందిని కేటాయించింది. ఇందులో ఒక ప్రైవేట్ సెక్రటరీ, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు, ఒక డ్రైవర్ ఉంటారు.
ఈ నియామకానికి సంబంధించిన మొత్తం ఖర్చులను బీసీ సంక్షేమ శాఖ రెగ్యులర్ బడ్జెట్ నుంచి భరిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా శివధర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఆయన ప్రధానంగా పోలీసు యంత్రాంగం, శాంతిభద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, నార్కోటిక్స్ కంట్రోల్, రోడ్డు భద్రత లాంటి అంశాలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించనున్నారు.
అదేవిధంగా శివధర్‌రెడ్డికి చీఫ్‌సెక్రటరీ హోదాతో పాటు నెలకు రూ.2.25 లక్షల వేతనాన్ని చెల్లించనున్నారు. నివాస సదుపాయానికి అదనంగా నెలకు రూ.50 వేల ఇంటి అద్దె పొందుతారు. ప్రభుత్వ వాహనంతోపాటు పదవీ విరమణకు ముందు పొందిన విధంగానే టీఏ, డీఏ, మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాలు కూడా శివధర్‌రెడ్డికి వర్తించనున్నాయి. ఆయన కార్యకలాపాల కోసం హోంశాఖ ప్రత్యేక సిబ్బందిని కేటాయించింది.
ఇందులో ఒక ఓఎస్డీ, ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, ఇద్దరు డ్రైవర్లు, నలుగురు ఆఫీస్ సబార్డినేట్లు ఉంటారు. ఈ నియామకానికి సంబంధించిన ఖర్చులను హోం శాఖ బడ్జెట్ నుంచి భరించనున్నారు. దీంతో రాష్ట్రంలో అంతర్గత భద్రత, శాంతిభద్రతల విషయంలో శివధర్‌రెడ్డికి ఉన్న అపారమైన అనుభవం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతగానో దోహదపడనుంది.
నా జీతం మొత్తం వారి చదువుకు ఇస్తా : వీహెచ్
కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తనకు ఇచ్చిన ప్రభుత్వ సలహాదారు పదవి ద్వారా వచ్చిన జీతం మొత్తాన్ని.. పేద విద్యార్థుల చదువులకు అందిస్తానని తేల్చి చెప్పారు. 2 ఏళ్ల పాటు నెలకు వచ్చే రూ.1 లక్షను ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ఇవ్వనున్నట్లు వెల్లడించి, ఆదర్శంగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశాలు ఇచ్చిందని.. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తానని వీహెచ్ తెలిపారు. అయితే ‘నేను రాజ్యసభ సీటు ఆశించాను. సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు ఈ పదవి తీసుకుంటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.






