కామారెడ్డిలో వడగళ్ల వాన బీభత్సం
నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
రాకపోకలకు అంతరాయం
పలుచోట్ల తృటిలో తప్పిన ప్రమాదాలు
కామారెడ్డి, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో బలమైన వర్షంతో పాటు వడగండ్ల వర్షం పడడంతో పట్టణ ప్రజలు ఆందోళన కు గురయ్యారు. బస్టాండ్ వద్ద వేపచెట్టు కూలి రోడ్డు కు అడ్డంగా పడిపోయింది.
ఆ సమయంలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను తొలగించి విద్యుత్తును పునరుద్ధరింపజేశారు. గత వారం రోజులుగా నలుపై డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండలు కొట్టడంతో ఆందోళన చెందిన పట్టణ ప్రజలకు అకాల వర్షం వడగండ్ల వర్షంతో ప్రజలు ఊరట చెందారు. కామారెడ్డి తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సైతం ఈదురుగాలతో కూడిన బలమైన భారీ వడగండ్ల వర్షం కురిసింది.






