పాత కక్షల ప్రతీకారమా?..
శెట్టి ఆత్మకూర్‌లో వ్యక్తి దారుణ హత్య.
గద్వాల టౌన్ జూలై 11: గద్వాల మండలంలోని శెట్టి ఆత్మకూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు సంధ్యా రాజు 45సం,గా పోలీసులు గుర్తించారు.ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.స్థానికుల కథనం ప్రకారం కొన్నేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో రాజు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.ఈ వ్యవహారానికి సంబంధించి ఆ మహిళ భర్త హత్య కేసులో రాజు నిందితుడిగా అరెస్టై జైలుశిక్ష అనుభవించాడు.ఇటీవలే ఆయన జైలు నుంచి విడుదలైనట్లు సమాచారం.ఈ నేపథ్యంలో గత హత్యకు ప్రతీకారంగా మృతుడి చేత తమ తండ్రి హత్యకు గురయ్యాడనే కక్షతో ఆ వ్యక్తి కుమారులే పథకం ప్రకారం రాజును హత్య చేసి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ కోణంతో పాటు అన్ని అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.సమాచారం అందుకున్న గద్వాల సీఐ శ్రీను,రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించి హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






