11 July, 2026 | 1:01 PM

రేవంత్ రెడ్డి దిగజారుడు మాటలు మానుకో

11-07-2026 11:59 AM

అభివృద్ధి చూపించమంటే.. అంగవైకల్యం గురించి మాట్లాడుతున్నాడు

బీఆర్ఎస్ కాలి గోటినికూడా తాకలేవు

విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 

ఖమ్మం, (విజయ క్రాంతి): వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననమే సీఎం రేవంత్(CM Revanth Reddy) ఎజెండా అని, సీఎం అయ్యి ఉండి దిగజారుడు మాటలు మాట్లాడటం సిగ్గు చేటని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Former Minister Puvvada Ajay Kumar) ధ్వజమెత్తారు. శనివారం ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. రోడ్డు ప్రమాదంలో జరిగిన దుర్ఘటన ఘటనలో నేను నా కన్ను కోల్పోయాను అని చెప్పారు.  గతంలోనూ సీఎం రేవంత్ ఇలాగే కించపరిచారని, హమీలను నెరవేర్చేందుకు మీకు ఏ అంగ వైకల్యం అడ్డు వచ్చింది అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని తప్పుబట్టారు.‌

నాకు ఉన్న ఒక్క కన్ను తోనే ఎంత పెద్ద గొప్పగా పని చేశానో ఎంత అభివృద్ధి చేశానో ప్రజలకు తెలుసు, మంత్రిగా నేను ఒక్క కంటితో చేసిన పని ఇప్పుడు ఉన్న ముగ్గురు మంత్రులు 6 కళ్లతో ఏం చేశారని ప్రశ్నించారు. నా మీద సీఎం, మంత్రులకు ఉన్న కక్ష తీర్చుకుంటారని, విషయ పరిజ్ఞానం లేక ముఖ్యమంత్రి స్థాయి మరిచి కన్ను లేదని పన్ను లేదని దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సీతారామ ప్రాజెక్టు కోసం కృషి చేశాను.. వ్యక్తిగత విమర్శలతో తాత్కాలికంగా సంతృప్తి పడతారు కానీ ఎల్లకాలం ఉండదన్నారు.  ఇచ్చిన హామీలు అమలు చేయక డొంకతిరుగుడు మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారని, రైతు భరోసా ను మూడు సీజన్లు ఎగవేశారు దాంతో పాటు 420 హమీల్లో ఏదీ సరిగ్గా అమలు చేయలేదన్నారు. మీరు విమర్శించిన నా ఒంటి కన్నుతో గోదావరి వరదలను పకడ్బందీగా సమీక్షించానని, ఎల్ నినో ప్రభావం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరంలో నీరు పారుతుందని వాస్తవం.. నీరు వదలకుండా రైతులను నిండా ముంచుతున్నారని,  కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుకి శ్రీకారం చుడితే నేనే తెచ్చానని మంత్రి తుమ్మల చెప్పుకుంటున్నారని అన్నారు.  సీతారామ ప్రాజెక్టు కోసం 9 వేల కోట్లు ఖర్చు చేశాం మీరు ఖర్చు చేసింది పెద్దగా ఏం లేదని ఆరోపించారు.

మీరు నెత్తిన చల్లుకుని నీళ్లు కేసీఆర్ చేసిన సీతారామ ప్రాజెక్టు కృషి వల్లనే, గోదావరిని కృష్ణా నదిలో కలపాలని ఏ నాయకుడు కృషి చేయలేదు.. కేసీఆర్ ఒక్కరే దానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. నీళ్లు దిగువకు పోతుంటే ఏపీ లో పట్టిసీమ ద్వారా చంద్రబాబు నీళ్లు ఎత్తి పోసుకుంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రయోజనాల పట్ల కనీస చిత్తశుద్ధి లేదన్నారు.