జిల్లాలో రాత్రి గస్తి పటిష్టం
సిబ్బందికి రిఫ్లెక్టివ్ జాకెట్లు, ఎల్‌ఈడీ బ్యాటన్స్ అందజేసిన ఎస్పీ
నల్లగొండ క్రైం, జూలై 17 :జిల్లాలో రాత్రి గస్తి వ్యవస్థను పటిష్టం చేసేందుకు నైట్ బీట్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రిఫ్లెక్టివ్ జాకెట్లు, ఎల్‌ఈడీ బ్యాటన్స్, ఫైబర్ లాఠీలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్‌శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బంది కి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి వేళల్లో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణలో నైట్ బీట్ పోలీసుల పాత్ర కీలకమని అన్నారు. నేరాలు జరిగే ప్రాంతాలు, చీకటి వీధులు, కాలనీలు, జాతీయ, రాష్ట్ర రహదారులపై నిరంతరం గస్తీ నిర్వహించాలని ఆదేశించారు.
రిఫ్లెక్టివ్ జాకెట్లతో రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు సిబ్బంది భద్రత పెరుగుతుందని, ఎల్‌ఈడీ బ్యాటన్స్ ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల తనిఖీలకు ఉపయోగపడతాయని తెలిపారు. కాలనీలు, బ్యాంకులు, ఏటీఎంలు, ఒంటరి ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేయాలని సూచించారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్, వాహన చోరీలను అరికట్టడంతో పాటు ఒంటరిగా ప్రయాణించే మహిళలు, వృద్ధులకు సత్వర సహాయం అందించాలని కోరారు. ఆధునిక పరికరాలతో పోలీసింగ్ను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, ఆర్.ఐలు సంతోష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.






