శాయంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ప్రజా పాలనలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం నగర మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజులతో కలిసి 31వ డివిజన్ పరిధిలోని శాయంపేట, సుభాష్ వీధిలో సైడ్ డ్రైన్లు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యం కలిగిన శాయంపేట ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రతి కాలనీలో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థలు, కమ్యూనిటీ హాల్స్, పాఠశాలల అభివృద్ధి, దేవాలయాల పునర్నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీల్లో కొత్త రోడ్లు నిర్మించడంతో అవి మోడల్ కాలనీలుగా మారాయని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సహకారం, స్థానిక నాయకత్వ ఐక్యతతో సమిష్టి కృషి ఫలితంగా వరంగల్ నగరం రూపురేఖలు మారుతున్నాయని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి సాధిస్తామని నమ్మకం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. అదేవిధంగా నగరంలో భూకబ్జా సమస్యలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు.




