7 April, 2026 | 6:17 PM

చెరువు కట్ట రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

07-04-2026 04:16 PM

హనుమకొండ,(విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్ గోపాలపురం ఊర చెరువు కట్ట రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావంతో తెగిపోవడంతో గోపాలపురం పరిధిలోని పలు కాలనీలు తీవ్ర ముంపుకు గురైన విషయం తెలిసిందే. చెరువు గట్టు తెగిపోవడంతో భారీగా వచ్చిన వరద నీరు కాలనీల్లోకి చేరి వివేకనంద నగర్, అమరావతి నగర్, సరస్వతి నగర్, సాయి నగర్ కాలనీలలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. అనేక ఇళ్లలోకి నీరు చేరడంతో గృహోపకరణాలు దెబ్బతిన్నాయి.

కాలనీలోని ప్రజలు భయాందోళనలకు గురై రోజులు గడిపిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో గోపాలపురం చెరువు గట్టు వద్ద బలమైన రిటైనింగ్ వాల్ నిర్మించాలని,ఇందుకు సుమారు 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి నేడు వరంగల్ ఎంపీ  కడియం కావ్య, నగర మేయర్  గుండు సుధారాణి తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గోపాలపురం ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ప్రజలకు మళ్లీ ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చెరువు గట్టు వద్ద బలమైన రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టడం ద్వారా భవిష్యత్తులో వరద నీరు కాలనీల్లోకి చేరకుండా నివారించవచ్చన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందించే దిశగా అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. చేపట్టిన పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.గోపాలపురం ప్రాంత ప్రజలు భవిష్యత్తులో ముంపు భయం లేకుండా ప్రశాంతంగా జీవించేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నాగరాజు హామీ ఇచ్చారు.

అలాగే చెరువు అక్రమనకు గురి కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని అన్నారు. రాబోయే రోజుల్లో  ముఖ్యమంత్రి  చేత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనతో పాటు తాగునీటి సమస్య కోసం 512 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని త్వరలో వాటి పనులు ప్రారంభిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, స్థానిక కార్పొరేటర్ సిరంగి సునీల్, మున్సిపల్ అధికారులు డి ఈ.హర్షవర్ధన్, ఏఈలు నజ్మా కహనం, జె.రాధిక, ఎండి జమీల్, సిబ్బంది రమేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.