జంక్షన్ల అభివృద్ధికి సహకరించండి
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ పట్టణంలోని పలు జంక్షన్లైన అంబేద్కర్, రాంనగర్,గోకుల్ నగర్, వడ్డేపల్లి చర్చి ప్రాంతాల్లోని జంక్షన్ లను అభివృద్ధిపరిచేందుకు ప్రజలు సహకరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గోకుల్ నగర్ జంక్షన్ లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... రోడ్లు ఇరుకుగా ఉండడంవల్ల ప్రజల రవాణాకు అంతరాయం ఏర్పడుతుంది.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, తద్వారా అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. హనుమకొండ బస్టాండ్ నుండి వడ్డేపల్లి చర్చి వరకు పోయే రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాలకు సంబంధించిన ప్రజలు జంక్షన్ల అభివృద్ధిలో సహకరించాలని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సహకరించి రోడ్డు వెడల్పు పనులకు ఆటంకం లేకుండా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ధికి సుమారు 26 కోట్ల రూపాయల నిధులు మంజూరై ఉన్నాయి.
ప్రజలు సహకరిస్తే అంబేద్కర్ జంక్షన్ నుండి వడ్డేపల్లి చర్చి జంక్షన్ వరకు రోడ్డును సెంట్రల్ లైటింగ్ సిస్టంతో సుందరంగా తయారు చేసేందుకు, ఇరువైపులా సైడ్ డ్రైనేజీ ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ అధికారులను ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హనుమకొండ కాంగ్రెస్ మహిళ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షులు బంక సతీష్ యాదవ్, పల్లకొండ సతీష్, ఎర్ర మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
వరద బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే నాయిని
వరద ప్రభావంతో కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధిత కుటుంబానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అండగా నిలిచారు. మంగళవారం రోజున 57వ డివిజన్ పరిధిలోని టీవీ టవర్ కాలనీలో నివసించే బాధిత కుటుంబాన్ని ఆయన స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు.గత నవంబర్ నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా జరిగిన వరదలో పాక శ్రీనివాస్ ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ విషాద ఘటనపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకు వెళ్లి, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించగా, ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును ఈరోజు బాధిత కుటుంబ సభ్యులకు నేరుగా అందజేశారు. క్లిష్ట సమయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ తహసిల్దార్ గుజ్జుల రవీందర్ రెడ్డి, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు కాలనీ ప్రజలు ,అధికారులు పాల్గొన్నారు.




