26 May, 2026 | 2:24 AM

పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వండి

26-05-2026 12:49 AM

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కశిరెడ్డి వినతి

రంగారెడ్డి, మే25(విజయక్రాంతి): గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి, కల్వకుర్తిలో పార్టీ జెండా ఎగర వేయడానికి అహర్నిశలు శ్రమించిన కరడుగట్టిన కార్యకర్తలను, నాయకులను గుర్తించి వారికి రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి విన్నవించారు. సోమవారం హైదరాబాద్లో ఆయన నివాసం లో ముఖ్యమంత్రిని నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతలు బాలాసింగ్, అయిల శ్రీనివాస్ గౌడ్ల తో మర్యాదపూర్వకంగా కలిశారు.

కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత సుదిని రాంరెడ్డిని తెలంగాణ ట్రిబ్యునల్ చైర్మన్గా నియమించడం పట్ల ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా నమ్ముకుని ఉన్న మరెందరో సీనియర్ నేతలు కల్వకుర్తిలో ఉన్నారని, రాబోయే రోజుల్లో వారికి కూడా తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు.

దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. సమావేశం లో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. గతంలో కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తానన్న నిధుల హామీని, దానికి సంబంధించిన పెండింగ్ ప్రపోజల్స్ గురించిన వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

నియోజకవర్గ పరిధిలోని మారు మూల గ్రామాలు, గిరిజన తండాలకు బీటీ రోడ్లు మంజూరు చేయాలని, రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. వ్యవసాయానికి, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు నియోజక వర్గంలో కొత్త విద్యుత్ సబ్స్టేషన్లను మంజూ రు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కూడా ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి కలిశారు. నియోజకవర్గ రోడ్లు, విద్యుత్ సబ్స్టేషన్ల నిధుల విడుదలకు తగిన బడ్జెట్ కేటాయించాలని కోరారు.కల్వకుర్తి నియోజకవర్గ ప్రగతికి, మౌలిక వసతుల కల్పనకు ప్రభు త్వం కట్టుబడి ఉందని, త్వరలోనే నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఎమ్మెల్యే కశిరెడ్డికి సానుకూల హామీ ఇచ్చారు.