వైభవంగా మహాశక్తి దేవాలయ 16వ వార్షికోత్సవం
కరీంనగర్, జూన్ 19 (విజయక్రాంతి): మహాశక్తి దేవాలయం 16వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. జగద్గురు శంకరాచార్య హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. పుణ్యాహవాచనం, గణపతి పూజ, అఖండ దీపారాధన, సర్వతోభద్ర మండల పూజ, లక్ష్మీగణపతి హోమం, రుద్ర సహిత చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యారణ్య భారతి స్వామి మాట్లాడుతూ దేవాలయం అంటే కేవలం కోరికలు తీర్చుకునే కేంద్రం కాదని, అది ఒక గొప్ప ఆధ్యాత్మిక స్ఫూర్తి కేంద్రమని, ఇక్కడ లభించే ప్రశాంతతను మనం అనుభవంలోకి తెచ్చుకోవాలన్నారు. దైనందిన అలవాట్లులో మార్పు చేసుకోవాలన్నారు. మనుషులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటానికి ప్రతిరోజూ సూర్య నమస్కారాలు ఆచరించాలని, దీనివల్ల మనకు అపారమైన శక్తి లభించడమే కాకుండా, అంతా శుభం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.






