3 June, 2026 | 2:07 AM

గ్రామ సభలను విజయవంతం చేయాలి

03-06-2026 12:00 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, జూన్ 2 (విజయక్రాంతి): వచ్చే నాలుగు రోజుల పాటు జిల్లావ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభల కోసం మండలాల వారీగా ఎంపిడిఓలు, తహసీల్దార్లు పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి గ్రామ సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  సూచించారు. జిల్లాలో నిర్వహించే గ్రామ సభలు,  శానిటేషన్, తాగునీరు, సీజనల్ వ్యాధుల నివారణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల సవరణలపై కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి సమీక్షా సమావేశం నిర్వ హించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఉన్న అన్ని శాఖల కు సంబంధించిన సిబ్బందితో పాటు, మం డల స్థాయి అధికారులు కూడా ఖచ్చితంగా గ్రామ సభల్లో పాల్గొనేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు వేదికల్లో  నిర్వహించే గ్రామ సభలకు అధికారులందరూ హాజరు కావాలని సూచించా రు. రైతులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక అవగాహన కల్పించాలన్నారు. రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వివరించాలన్నారు.

జిల్లాలో ఇప్పటివరకు 72శాతం ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, రా ష్ట్రంలోనే సూర్యాపేట జిల్లాను 3వ స్థానంలో నిలిపినందుకు వ్యవసాయ శాఖ అధికారులను అభినందించారు. అదే విధంగా జిల్లా లో యూరియా విక్రయాలు ఎక్కువగా ఉం డటంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు యూరియాను ఎందుకు అంత ఎ క్కువగా వినియోగిస్తున్నారనే అంశంపై వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరి శీలన చేసి, ఆలోచన చేయాలన్నారు.

అలాగే, వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరిక ట్టేందుకు టాస్క్ ఫోర్స్ బృందాలు గట్టి ని ఘా పెట్టాలని స్పష్టం చేశారు. అదే విధంగా రానున్న వర్షాకాలం పై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒకవేళ వర్షపాతం తక్కువగా నమోదైతే ఎదుర్కొనేందుకు ప్ర త్యామ్నాయ యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సంవత్స రం నిర్వహించబోయే వన మహోత్సవం కార్యక్రమం కోసం అటవీ శాఖ, డీఆర్డీఏ, పం చాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు పరస్ప రం సమన్వయం చేసుకుంటూ తక్షణమే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

పట్టణాలు, గ్రామాల్లో డ్రైనే జీల క్లీనింగ్, పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలన్నారు. వారం రోజుల్లోగా సమగ్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో కలుషిత నీటి సమస్య రాకుండా, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రజాపాలన కార్యక్రమాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులను అధికారులు సబ్మిట్ చేస్తే వెంటనే మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం చే పట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) పై అధికారులందరికీ పూర్తి అవగాహన ఉండాలని, ఇందు కోసం సిబ్బందికి తక్షణమే ఒకరోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు.

జిల్లా ప్రగతిలో అధికారులు, సి బ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి, ప్రభు త్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం ఎస్పీ నరసింహ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించ బోయే గ్రామ సభలు, వార్డు సభలను ప్ర శాంత వాతావరణంలో విజయవంతం చే సేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలా సిద్ధం గా ఉందన్నారు. ఈ సమావేశంలో  అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డిఆర్డిఓ సన్యాసయ్య, జెడ్పీ సీఈవో శిరీష, డిఎఫ్‌ఓ దామోదర్ రెడ్డి, డిపిఓ యాదగిరి, డిఏఓ శ్రీధర్ రెడ్డి, సి పిఓ కిషన్, జిల్లా ఫైర్ అధికారి కృష్ణారెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.