ఎక్వాయిపల్లిలో గ్రీన్ఫీల్ రోడ్డు భూసేకరణ గ్రామసభ
- అభివృద్ధికి రైతులు సహకరించాలి
- నాలా నిర్మాణానికి 2.11 గుంటల భూమి సేకరణపై ప్రజాభిప్రాయం
- హాజరైన అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి
కడ్తాల్, జూన్ 30(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైదరాబాద్ ‘ఫ్యూచర్ సిటీ’ కనెక్టివిటీ ఆరు వరుసల గ్రీన్ఫీల్ రహదారి (ఓ అర్ అర్ రావిర్యాల టు ట్రిపుల అర్ ఆమనగల్లు) నిర్మాణంలో భాగంగా కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామంలో రెండవసారి భూసేకరణ నోటిఫికేషన్ ప్రకారం మంగళవారం రెండవ గ్రామసభ నిర్వహించారు. కడ్తాల్ తహసీల్దార్ జయశ్రీ అధ్యక్షతన నిర్వహించిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్ర మానికి రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
నాలా నిర్మాణానికి భూసేకరణ.....
గ్రీన్ఫీల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఎక్వాయిపల్లి పరిధిలో వరద నీటి ప్రవాహానికి అంతరాయం కలగకుండా చేపట్టే నాలా (డ్రైనేజీ) నిర్మాణానికి అదనంగా 2.11 గుంటల భూమి అవసరముందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు భూ యజమానులు, రైతుల నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు ఈ గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఈ అంతర్జాతీయ స్థాయి గ్రీన్ఫీల్ ఎక్స్ప్రెస్వే ప్రాంతీయ రూపురేఖలను మార్చబోతోందని, రైతులు భూసేకరణకు సహకరించి ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. నిర్వాసితులకు చట్టప్రకారం మెరుగైన పరిహారం, న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు.
ఔటర్ రింగ్ రోడ్డు టూ రావిర్యాల టాటా ఇంటర్ఛేంజ్ నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా ఆమనగల్లు వద్ద రీజినల్ రింగ్ రోడ్డు ట్రిపుల్ అర్ కు అనుసంధానమయ్యే ఈ రహదారి ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్టుకు, హైదరాబాద్ నగరానికి రవాణా సౌకర్యాలు మరింత మెరుగవుతాయని అధికారులు వివరించారు. రైతులు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని, పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేస్తామని తహసీల్దార్ జయశ్రీ స్పష్టం చేశారు.
గ్రామ సభ కు బాధిత రైతులతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై తమ అభిప్రాయాలను అధికారులకు తెలిపారు.కార్యక్రమంలో ఎక్వాయిపల్లి గ్రామ సర్పంచ్ పాలకుర్ల కరుణాకర్ గౌడ్, ఉప సర్పంచ్ పుట్టి లక్ష్మి యాదయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సందీప్, జీపీఓ గణేష్, గ్రామ కార్యదర్శి నిరంజన్, రాఘవులు పాల్గొన్నారు. అలాగే స్థానిక నాయకులు సుమన్, మల్లేష్, శాంతయ్య, నరేష్, మధు, సురేష్, మహేష్ లు పాల్గొన్నారు.






