13 May, 2026 | 3:05 AM

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

13-05-2026 01:03 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, మే 12 (విజయక్రాంతి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అకాల వర్షాల ముప్పును దృష్టిలో ఉంచుకుని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

జిల్లాలో ఈ సీజన్లో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అంచనా వేయగా, సోమవారం వరకు 2 లక్షల మెట్రిక్ టన్నులను విజయవంతంగా సేకరించామన్నారు. నిరంతర పర్యవేక్షణ, అధికారులతో ప్రతిరోజూ సమీక్షలు నిర్వహించడం వల్లనే ఇంత పెద్ద మొత్తంలో సేకరణ సాధ్యమైందన్నారు.  మిల్లుల వద్ద అన్ లోడింగ్ ప్రక్రియ నెమ్మదించడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హమాలీల కొరత వల్ల అన్ లోడింగ్ ఆలస్యమవుతోందని  దీనివల్ల రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు.

మిల్లుల వద్ద హమాలీల సంఖ్యను రెండింతలు పెంచి, మూడు షిఫ్టుల్లో పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. ధాన్యం దిగుమతి చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించే మిల్లర్లపై చట్టపరమైన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ప్రైవేట్ లేదా అదనపు గోదాములను అద్దెకు తీసుకుని ధాన్యాన్ని నిల్వ చేయాలని సూచించారు.ధాన్యం తరలింపు కోసం ప్రస్తుతం ఉన్న 670 లారీలు సరిపోవడం లేదని, అదనపు లారీలు, డీసీఎంలను ఏర్పాటు చేసేందుకు పోలీస్, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొనుగోలు కేంద్రం నుండి మిల్లుకు 5 కిలోమీటర్ల లోపు దూరం ఉంటే, లారీల కోసం వేచి చూడకుండా ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించాలని సూచించారు.

ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద గన్నీ బ్యాగులు, హమాలీలు అందుబాటులో ఉండేలా తహసీల్దార్లు, మండల అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి మిల్లు వద్ద అన్ లోడింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఒక ఇంచార్జ్ అధికారిని నియమించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ కె.నరసింహ, అదనపు కలెక్టర్ బి హరి సింగ్, జిల్లా పరిషత్ సీఈవో శిరీష, డిఆర్డిఓ సన్యాసయ్య, డిఎస్‌ఓ మోహన్ బాబు, డిఏఓ శ్రీధర్ రెడ్డి, డిసిఓ ప్రవీణ్ కుమార్, డిఎమ్‌ఓ  నాగేశ్వర్ శర్మ, డిఎం సివిల్ సప్లై శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.