13 May, 2026 | 2:11 AM

20 రోజుల నిరీక్షణకు చెక్

13-05-2026 12:00 AM

కేబీ కాలనీ రైతుల బైఠాయింపుతో కదిలిన ధాన్యం కొనుగోలు కేంద్రం

సీఈవో వస్తేనే లేస్తాం అంటూ రైతుల ఆగ్రహం

గోమాత మిల్లుకు ప్రాధాన్యం కేబీ కాలనీ సెంటర్ అధికారుల నిర్లక్ష్యమా?

హుస్నాబాద్, మే12 (విజయక్రాంతి): హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీకి చెందిన రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు గత 20 రోజులుగా ఎదురుచూ స్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియలో జాప్యం కారణంగా ధాన్యాన్ని ఎండబెట్టేందుకు రోడ్లపైనే, కేంద్రాల వద్దనే నిల్వ ఉం చాల్సి వస్తోందని, దీంతో ధాన్యం పూర్తిగా చెడిపోతున్న పరిస్థితి నెలకొన్నదని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో మంగళవారం స్థానిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఫ్యా క్స్ కార్యాలయం ఎదుట కేబీ కాలనీ కొనుగోలు కేంద్రానికి చెందిన రైతులు పెద్దఎత్తున బైఠాయించి ఆందోళన చేపట్టారు. సీఈవో స్వయంగా వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలమని రైతులు భీష్మించుకుని కూర్చొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ& కేబీ కాలనీ కొనుగోలు కేంద్రంలో హమాలీలు, లోడింగ్ సిబ్బంది లేరనే కారణాలతో ధాన్యం తూకం వేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే స్థానిక గో మాత రైస్ మిల్లులో మాత్రం హమాలీలు అందుబాటులో ఉండటంతో అక్కడి నుంచి రోజుకు ఒకటి, రెండు లారీల చొప్పున ధాన్యం తరలింపు కొనసాగుతోందని ఆరోపించారు. తమ కేంద్రం విషయంలో మా త్రం అధికారులు మొండిచేయి చూపిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు రైతులు నినాదాలు చేస్తూ ఆం దోళన కొనసాగించారు. మా సమస్య పరిష్కారం అయ్యే వరకు వెళ్లేది లేదు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్కడి సిబ్బంది, సెంటర్ ఇన్చార్జి మరియు ఇతర బాధ్యులు రైతులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించినప్పటికీ మొదట రైతులు వినిపించుకోలేదు. చివరకు ఒక గంటలోనే మీ ధాన్యాన్ని తూకం వేసి లారీల ద్వారా తరలిస్తాం అని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించినట్లు సమాచారం. అయితే ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా ప్రభుత్వం, అధికారులు వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు డిమాండ్ చేశారు.