ఇంధన ధరలు పెరిగితే అందరిపై భారం
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రంపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకు పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించి, ఎన్నికలు ముగిసిన వెంటనే ఒక్కసారిగా ధరలను పెంచడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారీ ఆర్థిక భారం మోపిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఉదయం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన లో స్పందించారు.
ఎన్నికల సమయంలో ప్రజల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకొని ధరలను నిలిపివేసి, ఎన్నికలు పూర్తయిన వెంటనే పెంపు చేపట్టడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. గతంలో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 140 డాలర్ల వరకు పెరిగినప్పటికీ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యమైనంతవరకు ధరలను నియంత్రించి ప్రజలపై అదనపు భారం పడకుండా చూసిందని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు అంతగా పెరగకపోయినా, కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో భారాన్ని ప్రజలపై మోపుతోందని ఆయన ఆరోపించారు.
క్రూడ్ ఆయిల్ ధరల మార్పులను ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఆయిల్ కంపెనీలపై సరైన నియంత్రణ లేకపోవడం, ప్రజా ప్రయోజనాల కంటే ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు పెరిగి, దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుందని, దీని వల్ల సాధారణ ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ధరల పెంపును పునఃసమీక్షించి, ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలు తగవని ఆయన స్పష్టం చేశారు. దేశాన్ని సమర్థవంతంగా నడిపించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.






