కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమర భేరి
గోడ ప్రతుల ఆవిష్కరణ
రైతు సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు
మానకొండూరు,(విజయక్రాంతి): రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అన్నదా తలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదని, ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ డిమాండ్ల సాధనకు రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 30 న కరీంనగర్ వేదికగా భారీ ఎత్తున నిర్వహించే రైతు మహాగర్జన సమరభేరి సభకు మద్దతు కోరుతూ శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ నాయకులతో మండల కేంద్రంలో మహాగర్జనకు సభకు ఆహ్వానిస్తూ, పోలాడి రామారావు నాయకులను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు.
రామారావుతో కలిసి గోడ ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం పోలాడి రామారావు, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు తాళ్ళ పల్లి శేఖర్ గౌడ్ లు మాట్లాడుతూ, రాష్ట్రం లో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు నత్త నడకన సాగుతున్నాయని విమర్శించారు.ప్రభుత్వం ప్రకటించిన రూ. 500బోనస్ చెల్లింపులో అనేక కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలలో అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో మిల్లర్లు,కింది స్థాయి సిబ్బంది కుమ్మక్కై తేమ, తాలు పేరుతో క్వింటాల్ కు ఆరు కిలోల నుండి 8 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను నిలువుగా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ గ్రేడ్ దాన్యాన్ని కామన్ గ్రేడ్ క్రింద జమ కడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులు దాన్యాన్ని ఎండ బెట్టే క్రమంలో తీవ్రమైన ఎండల తో రైతులు మృత్యువాత పడటం కలచివేసిందన్నారు.పెట్టు బడి సాయం క్రింద అందించాల్సిన రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పోలాడి రామారావు ద్వజమెత్తారు. యాసంగి సీజన్ ముగిసినా, నేటికీ రైతుల ఖాతాలో పూర్తిగా నిధులు జమ కాకపోవడం ప్రభుత్వ చిత్త శుద్ధికి నిదర్శనమన్నారు. కొనుగోలు కేంద్రాలలో లారీలు, హమాలి లు, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. అన్ని పంటలకు బోనస్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయాలకతీతంగా రైతాంగ సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఈ నెల 30 న కరీంనగర్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల మందితో నిర్వహించతలపెట్టిన రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు రామంచ గోపాల్ రెడ్డి,దేవ సతీష్ రెడ్డి,పంజాల శ్రీనివాస్,కసిరెడ్డి రాజేందర్ రెడ్డి,గోపు ఈశ్వర్ రెడ్డి,పిట్టల మధు,గంగుల రవి,బాకారపు రాములు,సర్పంచులు ఎరుకల శ్రీనివాస్ గౌడ్, తాళ్ళపల్లి సంపత్, పారునంది కిషన్, మోటం సమ్మయ్య, అనిల్ కుమార్, బండారు శ్రీనివాస్, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.






