24 July, 2026 | 4:32 AM

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వాల చలగాటం

24-07-2026 12:00 AM
  1. ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్
  2. వరంగల్ లో ఏఐఎస్‌ఎఫ్ చలో కలెక్టరేట్

వరంగల్, జులై 23 (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నాయని, విద్యా రంగ సమస్యలను పట్టించుకోవడంలేదని, రాష్ట్ర సర్కారు పెండింగ్ ఫీజులు చెల్లింపులు చెయ్యకపోతే విద్యార్ధుల చదువులు కొనసాగేదెలా అని, 27 వేల ప్రభుత్వ పాఠశాలను 4 వేల కస్టర్ గా తగ్గించడం కాదని, ఉన్నా ప్రభుత్వ బడుల సమస్యలు పరిష్కరించాలని, కాంగ్రెస్ తెచ్చిన పథకానికి తానే తూట్లు పొడుస్తుందని, ఫీజు బకాయిలు విడుదల చేయకుంటే ప్రభుత్వంపై ఉద్యమం తప్పదని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్ హెచ్చరించారు.

గురువారం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్ వరంగల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏకశిలా పార్కు నుండి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర చే స్తున్నాయని ఆరోపించారు.

రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు నేటికీ విద్యా శాఖ మంత్రిని కేటాయించకపోవడం అనేది చాలా బాధాకరమని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గరనే వి ద్యాశాఖను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించకపోవడం చాలా విచారకరమన్నారు. ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో విద్యారంగ సమస్యలు ‘ఎక్కడ వేసినా గొంగడి అక్కడే’ అన్న చందంగా ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ లో ఉన్నటువంటి 10,500 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇప్పటికీ విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రైవేట్, కళాశాలలు ఫీజుల పేరుతో విద్యార్థుల సర్టిఫికెట్లను నిలుపుదల చేయడం తీవ్ర అన్యాయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విజయ లక్ష్మికి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి దిడ్డి పార్థసారథి, ల్యాదల్ల శరత్, నాయకులు మేకల అభిరామ్, జిలకర కార్తీక్, జి. సురేష్, ప్రశాంత్, రెండావుల రాజెష్, పెనుకుల మధు, వేముల శ్రీకాంత్, పెండ్యాల రాజు కుమార్, మహమ్మద్ యాసిన్, ముత్యాల కౌశిక్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.