23-02-2026 12:28:05 AM
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): వేములవాడ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు కోనాయపల్లిలో ఆదివారం నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి నూతన వస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పేద ప్రజలకు గృహ స్వప్నాన్ని నెరవేర్చే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంతింటి సంతోషాన్ని పొందుతున్నాయని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు పథకం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు స్థిర నివాసం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని, అభివృద్ధి పథంలో వేములవాడ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్,స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.