23 May, 2026 | 8:59 PM

జవహర్ నగర్ గబ్బిలాల పేటలో సత్వరమే ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలి

23-05-2026 08:05 PM

పేదల చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి

ఎంపీ ఈటెల రాజేందర్ కు ఏఐఎస్ఎఫ్ వినతి

జవహర్ నగర్,(విజయక్రాంతి): మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్, డంపింగ్ యార్డ్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,‌ వెంటనే వీలైనన్ని పాఠశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్కు ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా  ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద డంపింగ్ యార్డ్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అన్నారు.

ఈ ప్రాంతంలో ఎందరో పేద, మధ్యతరగతి ప్రజలు జీవిస్తున్నారని  వారి పిల్లలకు సరైన విద్యా అవకాశాలు లేకపోవడంతో డ్రగ్స్, గంజాయికి బానిసలుగా మారుతున్నారు. ఈ ప్రాంతంలో లక్ష మందికి పైగా విద్యార్థులు వున్నారని, కానీ నాలుగు పాఠశాలలు మాత్రమే వున్నాయన్నారు. దీంతో చదువుకోవాలనే తపన వున్నా, పాఠశాలలు లేకపోవడంతో బాల కార్మికులుగా మారుతున్నారన్నారు. ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకురావాలని  ఈటెల రాజేందర్ కు విజ్ఞప్తి చేశారు.