27 March, 2026 | 2:59 AM

ఐటీ టవర్స్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యం

27-03-2026 01:02 AM
  1. గతంలో వచ్చిన చాలా కంపెనీలు వెనక్కి
  2. ఉద్యోగాల కల్పనకు తీసుకుంటున్న చర్యలేంటి
  3. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): కారణం ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ టవర్స్ నిర్వహణను నిర్లక్ష్యం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గతంలో వచ్చిన చాలా కంపెనీలు వెనుదిరుగు తున్నాయని, ఇక్కడ యువత నిరుద్యోగులుగా మారుతున్నారని మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఐటీ రంగాన్ని హైదరా బాద్‌లోనే కాదు ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా విస్తరించి యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పారు.

ఇందులో భాగంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో ఐటీ టవర్స్ నిర్మించినట్టు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక ఎప్పటికప్పుడు ఐటీ టవర్స్‌పై సమీక్ష చేసి కొత్త కంపెనీలను ఆహ్వానించడం ద్వారా పట్టణాల్లో యువతకు ఉద్యోగాలను కల్పించడానికి ఏం చర్యలు తీసుకున్నదని ప్రశ్నించారు.

సిద్దిపేట ఐటీ టవర్‌లో బీఆర్‌ఎస్ హయాంలో 18 కంపెనీలు పనిచేస్తే, ఇప్పుడు 7 కంపెనీలు వెళ్లిపోయి 11 మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. ఇంటర్‌నెట్ బిల్లు చెల్లించక పోవడంతో ఐటీ టవర్‌కు ఇంటర్నెట్‌కట్ చేశారని, ఐటీ నిర్వహణ అవుట్ సోర్సింగ్ కంపెనీకి బిల్లులు చెల్లించకపోవడంతో అక్కడున్న స్వీపర్, వాచ్‌మాన్, తదితర స్టాఫ్‌కు 4 నెలలుగా జీతాలు రాని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

మూడేండ్లకు ఆ కంపెనీలకు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీ కల్పించామని, ఇప్పుడిప్పుడే ఆ కంపెనీలు నిలదొక్కుకుంటున్న నేపథ్యంలో మరో మూడేండ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీ కొనసాగించాలని, ద్వితీయ శ్రేణి నగరాల్లోని ఐటీ టవర్స్‌లో ఉన్న అన్ని కంపెనీలకు మరో మూడేండ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీ కల్పించాలన్నారు.