24 April, 2026 | 8:32 PM

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తుంది

24-04-2026 06:55 PM

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

బోడుప్పల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి

మేడిపల్లి,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ఘట్కేసర్ మాజీ జెడ్పిటిసి, బోడుప్పల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి అన్నారు. గురువారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల బస్సు డిపో వద్ద మూడవ రోజు ధర్నా నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులకు బిఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని కానీ అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కిందని అన్నారు. ఆర్టీసీ కార్మికులను సైతం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని వారికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కార్మికులను గాలికి వదిలేశారని విమర్శించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల డిమాండ్లను పరిష్కరించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.