25 August, 2026 | 2:57 AM

ప్రభుత్వ భూమిని ‘ప్రైవేట్ పట్టా’గా!

25-08-2026 12:00 AM
  1. మార్చి మైనింగ్ లీజు
  2. ప్రజావాణిలో రైతుల ఫిర్యాదు 
  3. విచారణకు అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశం

ఆమనగల్లు, ఆగస్టు 24 (విజయక్రాంతి): ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రా మంలోని ప్రభుత్వ భూమి రికార్డుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. సర్వే నంబర్ 304లోని ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు మైనింగ్ లీజుకు కేటాయించే క్రమంలో ‘ప్రైవేట్ పట్టా భూమి‘గా మార్చడంపై గ్రామస్థుల నుండి ఫిర్యాదు అందడం తో అడిషనల్ కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు.

భూమి వివాదం నేపథ్యం..

గ్రామస్థులు, రైతుల కథనం ప్రకారం.. సర్వే నంబర్ 304లోని భూమి గ్రామ ఉమ్మడి ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉంది. ఇందులో కొన్ని భూములు నిరుపేదలకు అసైన్డ్ భూములుగా కేటాయించబడ్డాయి. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ భూమిని రిజిస్ట్రేషన్ల నిషేధిత జాబితా (సెక్షన్ 22-A) లో చేర్చింది.

అయితే, 2025లో ఒక ప్రైవేట్ సంస్థకు మైనింగ్ లీజు మంజూరు చేసే ప్రక్రియలో, అధికారులు నిషేధిత జాబితాలోని ఈ ప్రభుత్వ భూమిని రికార్డుల్లో ‘ప్రైవేట్ పట్టా భూమి‘గా చూపించారని గ్రామస్థులు జిల్లా కలెక్టర్కు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

చట్టాల ఉల్లంఘనపై రైతుల ఆగ్రహం..

ఫిర్యాదు పత్రంలో అధికారులు ప్రధానంగా కింది నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. తెలంగాణ భూసేవల చట్టం (1317 ఫస్లీ - సెక్షన్ 166-B): ప్రభుత్వ ఆస్తుల స్వభావాన్ని మార్చడం, తప్పుడు రికార్డులు సృష్టించడం చట్టవిరుద్ధం. ధరణి అర్ ఓ అర్ చట్టం..,. రికార్డులలో మార్పులు కేవలం నియమానుసారం డిజిటల్ పద్ధతిలోనే జరగాల్సి ఉండగా, అనధికారిక ఎంట్రీలు సృష్టించడం నేరంగా పరిగణించబడుతుంది.

విచారణకు కలెక్టరేట్ ఆదేశాలు..

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన అడిషనల్ కలెక్టర్, ఆమనగల్లు తహశీల్దార్ను తక్షణమే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సర్వే నంబర్ 304లోని భూమిపై సమగ్ర నివేదిక  ఇవ్వాలి.భూమి ప్రస్తుతం 22-A నిషేధిత జాబితాలో ఉందా లేదా పట్టా భూమిగా ఉందో స్పష్టం చేయాలి.

ప్రారంభ రికార్డుల నుండి ఇప్పటివరకు ఉన్న అన్ని పహానీలను తనిఖీ చేసి నివేదికకు జత చేయాలని ఆదేశించారు.తప్పుడు రికార్డులతో లీజు పొందిన వారిపై మరియు ఇందుకు సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.