7 కోట్ల ప్రభుత్వ ధాన్యం మాయం?
- మెదక్ జిల్లా కొల్చారం సత్యసాయి రైస్‌మిల్లుపై విజిలెన్స్ దాడులు
- 3,029.96 టన్నుల ధాన్యం కొరత గుర్తింపు
- యాజమాన్యంపై కేసు నమోదు
కొల్చారం, జూలై 21: మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని శ్రీ సత్యసాయి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్‌మిల్లులో ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) కోసం అప్పగించిన ధాన్యం నిల్వల్లో భారీ కొరత వెలుగుచూసింది. రాష్ట్ర విజిలెన్స్ అధికారులు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి సోమవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 3,029.96 టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
ఈ ఘటనపై మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖరీఫ్ 2025---26 సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం సీఎంఆర్ కింద మిల్లుకు అప్పగించిన ధాన్యం నిల్వలను అధికారులు రికార్డులు, గోదాముల్లోని నిల్వలు, సివిల్ సప్లుసై లెక్కలతో సరిపోల్చి పరిశీలించారు. అధికారుల లెక్కల ప్రకారం మిల్లులో 4,426.49 టన్నుల ధాన్యం ఉండాల్సి ఉండగా, తనిఖీ సమయంలో 1,396.53 మెట్రిక్ టన్నులు మా త్రమే ఉన్నట్లు గుర్తించారు.
దీంతో 3,029.96 టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన విజిలెన్స్ అధికారులు సంబంధిత రైస్‌మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు డీఎస్‌ఓ తెలిపారు. ప్రభుత్వ ధాన్యా న్ని ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. పూర్తి విచారణ నివేదిక అందిన అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని డీఎస్‌ఓ నిత్యానంద్ తెలిపారు.
2022 సీజన్ నుంచి ధాన్యం బకాయిలు
కొల్చారం సత్యసాయి రైస్ మిల్‌కు సంబంధించి 2022--23 యాసంగి సీజన్ నుంచి పెద్ద మొత్తంలో ధాన్యం బకాయి పడినట్లు తెలిసింది. 2022-23 సీజన్ నుంచి ధాన్యం నిల్వలను అధికారులు పరిశీలిస్తే పెద్ద మొత్తం లో ధాన్యం కుంభకోణం వెలుగు చూసే అవకాశం ఉంది.






