9 May, 2026 | 3:38 AM

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం

09-05-2026 12:00 AM

బీఆర్‌ఎస్ నేతల ధ్వజం

నంగునూరు, మే 8: ధాన్యం కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు కళ్లాల్లో నే పడిగాపులు కాస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎంపీ పీ జప శ్రీకాంత్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు అనగొని లింగం గౌడ్ మాట్లాడారు. తూకం పూర్తయినా లారీలు రాకపోవడంతో ధాన్యం బస్తాలు వర్షానికి తడిసి ముద్దవుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

మిల్లర్లు తరుగు పేరుతో చేస్తున్న దోపిడీని అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని వారు విమర్శించారు. గత ప్రభుత్వంలో కొనుగోళ్లు సాఫీగా సాగేవని గుర్తు చేస్తూ.. ప్రస్తుతం ’బి’ గ్రేడ్ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

తక్షణమే ప్రభుత్వం ధాన్యాన్ని ’ఏ’ గ్రేడ్ కింద సేకరించి, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రేకులపల్లి సంతోష్ రెడ్డి,సర్పంచ్ బాల పోచయ్య, మండల నాయకులు రాగుల సారయ్య, జైపాల్ రెడ్డి, అజిత్ తదితరులు పాల్గొన్నారు.