గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
శంకర్‌పల్లి, జూన్ 19 (విజయక్రాంతి): గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. శంకర్ పల్లి మండలంలోని పొద్దుటూరు-మేడిపల్లి, పొద్దుటూరు-టంగుటూరు గ్రామాల లింక్ రోడ్డు పనులను రూ. 5.50 కోట్ల నిధులతో ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
గ్రామాల్లో మంచినీరు, అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, వీధిదీపాల సమస్యలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీర్ఘకాలిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని, అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సమన్వయంతో అర్హులకు పథకాలు అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో శంకర్ పల్లి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, గ్రామ సర్పంచ్ బండ లక్ష్మి నరసింహ, మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.






