ఆరోగ్యమే తల్లికి నిజమైన బహుమతి
ఏటా మే నెల రెండవ ఆదివారం జరుపుకునే ప్రపంచ మదర్స్ డే, తల్లుల పట్ల ప్రేమ, గౌరవాన్ని వ్యక్తపరచుకునే ప్రత్యేక సందర్భం. కానీ ఈ రోజు కేవలం శుభాకాంక్షలు చెప్పుకోవడానికే పరిమితం కాకుండా, తల్లుల ఆరోగ్యం, సంక్షేమం గురించి ఆలోచించే రోజు కూడా కావాలని అంటున్నారు.. డాక్టర్ కె శిల్పిరెడ్డి.
నేడు ప్రపంచ మదర్స్ డే
మాతృత్వం అనేది అమూల్యమైన బాధ్యత. కుటుంబాన్ని చూసుకోవడం, పిల్లలను పెంచడం, ఇంటి బాధ్యతలు నిర్వర్తించడం వంటి పనుల్లో నిమగ్నమై ఉండే తల్లులు, చాలాసార్లు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. తగిన విశ్రాంతి లేకపోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయడం వల్ల దీర్ఘకాలంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఆరోగ్యంగా ఉన్న తల్లి మాత్రమే కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచగలదు. అందుకే మహిళలు తమ ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలి. ముఖ్యం గా గర్భధారణ సమయంలో, ప్రసవానంతర దశలో, అలాగే మెనోపాజ్ దశలో శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో సరైన వైద్య సలహా తీసుకోవడం ఎంతో అవసరం.
తల్లులు పాటించాల్సిన చిట్కాలు..
క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి, సమతుల ఆహారం తీసుకోవాలి, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ ఆహారం, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. తగినంత నిద్ర పోవాలి, ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలి.
ఏవైనా ఆరోగ్య సమస్యలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇంటి పనులు, ఉద్యోగం, పిల్లల సంరక్షణ ఈ మూడు బాధ్యతల మధ్య మహిళలు ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కుటుంబ సభ్యు లు తల్లులకు భావోద్వేగ సహాయం అందించడం ఎంతో ముఖ్యం.
కుటుంబం బాధ్యత కూడా ముఖ్యమే
తల్లి ఆరోగ్యాన్ని కాపాడడం కేవలం ఆమె బాధ్యత కాదు. కుటుంబ సభ్యులు కూడా తల్లికి విశ్రాంతి కల్పించడం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా ప్రోత్సహించడం అవసరం. చిన్న చిన్న సహాయాలు కూడా ఆమెకు పెద్ద మద్దతుగా మారుతాయి. ఈ మదర్స్ డే సందర్భంగా తల్లులకు పూలు, బహుమతులు ఇవ్వడం కంటే, వారి ఆరోగ్యాన్ని కాపాడే అలవాట్లను ప్రోత్సహించడం గొప్ప కానుక. ఎందుకంటే తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆనందంగా ఉంటుంది.






