1 September, 2026 | 11:33 PM

మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి

01-09-2026 | 10:31pm

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల(Government schools) విద్యార్థులకు యూనిఫాంలు కుట్టించడం ద్వారా మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్(Collector Garima Agrawal) తెలిపారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని శ్రీ రేణుక మాత మహిళాశక్తి టైలరింగ్ సెంటర్‌ను(Sri Renuka Mata Mahilashakti Tailoring Center) మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యులు విద్యార్థుల యూనిఫాంలు కుడుతున్న విధానాన్ని పరిశీలించి, ఒక్కో మహిళ రోజుకు ఎన్ని యూనిఫాంలు కుడుతున్నారు, వారికి ఎంత ఆదాయం సమకూరుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

తంగళ్లపల్లి మండలంలోని 43 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 3,560 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫాంలు అందించేందుకు నాలుగు కేంద్రాల్లో 28 మంది మహిళా సంఘాల సభ్యులు కుట్టు పనులు నిర్వహిస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ పనుల ద్వారా మహిళా సంఘాల సభ్యులకు మొత్తం రూ.5.34 లక్షల ఆదాయం సమకూరనుందని తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యూనిఫాంల కుట్టు బాధ్యతను అప్పగించిందన్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రత్యేక శ్రద్ధతో యూనిఫాంల కుట్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ పరిశీలనలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, ఇంచార్జి తహసీల్దార్ మురళి, ఎంపీడీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు.