అశ్వాపురం రైస్‌మిల్ యజమాని అరెస్ట్
రూ.2.68 కోట్ల మేర తేడాలు ఉన్నట్లు సమాచారం..
పౌరసరఫరాల అధికారుల ఫిర్యాదుతో పోలీసుల చర్య
అశ్వాపురం,(విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన ఓ రైస్‌మిల్ యజమానిని అశ్వాపురం(Ashwapuram ) పోలీసులు సోమవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం కేటాయింపులు, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సమర్పణలో భారీగా తేడాలు ఉన్నట్లు గుర్తించిన పౌరసరఫరాల శాఖ అధికారులు(Civil Supplies Department officials) ఇటీవల సంబంధిత రైస్‌మిల్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వం కేటాయించిన ధాన్యానికి, మిల్లింగ్ అనంతరం ప్రభుత్వానికి అందించాల్సిన సీఎంఆర్‌కు మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
తేడాలు స్పష్టంగా ఉన్న నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదివారం అశ్వాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి, రైస్‌మిల్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు అశ్వాపురం సీఐ సిరివేరు ఎల్లయ్య తెలిపారు. కాగా, ధాన్యం–సీఎంఆర్‌కు సంబంధించిన తేడాల విలువ దాదాపు రూ.2.68 కోట్ల మేర ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.






