భూ రీ సర్వేను నిలిపివేయాలని గ్రామస్తుల ధర్నా
ప్రభుత్వ పశుగ్రాస భూమిని కాపాడాలని రాఘవపేట, నడికుడ ప్రజల డిమాండ్
మల్లాపూర్,(విజయక్రాంతి): ప్రభుత్వ పశుగ్రాసం కోసం కేటాయించిన భూమికి సంబంధించి చేపడుతున్న రీ సర్వేను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాఘవపేట, నడికుడ గ్రామాల ప్రజలు మంగళవారం రోడ్డుపై ధర్నా నిర్వహించారు. నడికుడ గ్రామానికి చెందిన చంద నర్సారెడ్డి, తండ్రి మల్కారెడ్డి పేరుతో ఉన్న 299 సర్వే నంబర్ భూమి విషయంలో వివాదం నెలకొన్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. నడికుడ గ్రామంలోని గుడ్డంగుల గుట్ట ప్రాంతంలో ఉన్న భూమిని ప్రభుత్వం పశుగ్రాసం కోసం కేటాయించింది.
అయితే ఈ భూమి నడికుడ గ్రామానికి సంబంధించినదని, ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్కొండాపూర్ గ్రామం వైపు నర్సారెడ్డికి భూమి కేటాయించినట్లు అప్పటి రాఘవపేట, నడికుడ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నర్సారెడ్డికి వివరించినట్లు వారు పేర్కొన్నారు. ఫకీర్కొండాపూర్ గ్రామస్థులతో వివాదం నేపథ్యంలో నడికుడలోని గుడ్డంగుల గుట్ట భూమిని ఆక్రమించి సర్వే నంబర్ చేయించుకొని ఆయిల్ ఫార్మ్ చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గతంలో ఈ సర్వే నంబర్ మోకా వద్ద కూడా లేదని తీర్పు వచ్చినట్లు వారు తెలిపారు. ప్రభుత్వ పశుగ్రాస భూమిని పరిరక్షించాలని, భవిష్యత్‌లో ఎలాంటి ఆక్రమణలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా గుడ్డంగుల గుట్ట ప్రాంతంలో వన్యప్రాణులు సంచరిస్తుంటాయని, ఈ భూమిని పరిరక్షించడం ద్వారా వాటి ఆవాసాలకు రక్షణ కల్పించవచ్చని గ్రామస్తులు పేర్కొన్నారు.ఈ సమస్యపై రాఘవపేట సర్పంచ్ తోట శ్రీనివాస్, నడికుడ సర్పంచ్ తూర్పు సమతా రాజు, ఉప సర్పంచ్ మారుతి తదితరులు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్‌ను కలిసి సమస్యను వివరించారు.ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యను ఎంఆర్వో, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ సమావేశంలో ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ధర్నాను విరమించాలని పోలీసులు కోరడంతో గ్రామస్తులు తాత్కాలికంగా ధర్నాను విరమించారు.






