అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
మాడ్గుల, జూన్ 30(విజయక్రాంతి):పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను చేరవేయడమే తమ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మాడుగుల మండల కేంద్రం లో రైతు వేదికలో గ్రామాలకు చెందిన 48 మంది ఆడబిడ్డల కుటుంబాలకు ‘కళ్యాణ లక్ష్మి’ చెక్కులను ఎమ్మెల్యే, అధికారులు,స్థానిక నేతలతో కలిసి పంపిణీ చేశారు.
ప్రస్తుత వానాకాలం సీజన్ను దృష్టిలో ఉంచుకుని పత్తి సాగు చేస్తున్న స్థానిక రైతులకు సబ్సిడీపై నాణ్యమైన పత్తి విత్తనాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. రైతులే దేశానికి వెన్నెముక అని వాతావరణ పరిస్థితులను గమనిస్తూ, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రైతులు సకాలంలో విత్తనాలు వేసుకోవాలి. ఆధునిక పద్ధతులు పాటించి నాణ్యమైన, అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాల్లో మండల ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు, రైతులు పాల్గొన్నారు.






