14 July, 2026 | 3:31 AM

ఐఎన్టీయూసీ కృషితోనే జీఓ 88 విడుదల

14-07-2026 12:13 AM
  1. కార్మికుల శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి రుజువైంది..
  2. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలి.. 
  3. ఐఎన్టీయుసి  రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజి రెడ్డి

ముషీరాబాద్, జూలై 13(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐఎన్ టీయుసి గత రెండు నెలలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెం.88ను విడుదల చేయడం స్వాగతించదగ్గ పరిణామమని ఐఎన్ టీయుసి రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు, తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మొగుళ్ల రాజిరెడ్డి సోమవారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, ఉద్యోగుల వ్యవస్థపై సమగ్ర ఆడిట్ నిర్వహించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఓ 88 తమ నిరంతర పోరాటానికి ఫలితమని ఆయన పేర్కొన్నారు.

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై పలుమార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించామని, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, పారదర్శకత, సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమం, శ్రేయస్సుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని జిఓ 88 విడుదల ద్వారా మరోసారి రుజువైందని ఆయన తెలిపారు. జిఓ -88 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల పనితీరు, ఉద్యోగులకు ఈపిఎఫ్, ఈఎస్‌ఐ, కనీస వేతనాల అమలు,

డిబిటి ద్వారా వేతనాల చెల్లింపు, నకిలీ ఏజెన్సీల గుర్తింపు, ఉద్యోగుల పూర్తి డేటాబేస్ రూపకల్పన వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలించనుండడం హర్షణీయమన్నారు. ఈ నిర్ణయం వల్ల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హక్కులకు మరింత భరోసా లభిస్తుందన్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, ఉద్యోగుల వ్యవస్థపై ఇటీవల ముఖ్యమంత్రి సమీక్షించి ప్రకటించిన మేరకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగుల జీతాలు ప్రతి నెల1వ తేదీన చెల్లించేందుకు, కనీస వేతన చట్టం ప్రకారం కార్మికులందరికీ కనీస వేతనాలు చెల్లించేందుకు  సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.