26 April, 2026 | 1:26 AM

అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ కొరడా

26-04-2026 12:00 AM

పరివేక్షించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్లు అధికారులు

సికింద్రాబాద్/రాజేంద్రనగర్, ఏప్రిల్25 (విజయక్రాంతి) : అక్రమ నిర్మాణాలపై మరోసారి జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా జరిపించారు. హైకోర్టు ఆదేశాలు మేరకు సికింద్రాబాద్ జోన్ పరిధిలో జీహెచ్‌ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు ఎం.ఎన్.ఆర్.జ్యోతి,సుధీర్ సింగ్, చీఫ్ సిటీ ప్లానర్ పర్యవేక్షణలో ఆక్రమణల తొలగింపు నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో తార్నాక, మెట్టుగూడ సర్కిళ్ల పరిధిలో చిలకలగూడ ఎక్స్ రోడ్ నుండి వారసిగూడ ఎక్స్ రోడ్ వరకు అక్రమ నిర్మాణాలను తొలగించారు.

ఈ సందర్భంగా ఫుట్‌పాత్‌లు, రహ దారులపై ఉన్న 100కు పైగా తాత్కాలిక, శాశ్వత ఆక్రమణలను పాదచారులకు, వాహనాల రాకపోకలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పౌరులు, దుకాణదారులు, వ్యాపారులకు భవిష్యత్తులో రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించవద్దని కఠినంగా సూచించారు. ఇలాంటి ఆక్ర మణలు ప్రజలకు ఇబ్బందులు కలిగించడం తో పాటు భద్రతా సమస్యలకు దారితీస్తాయని తెలిపారు.

భవిష్యత్తులో కూడా ఇలాం టి డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మంగటాయారు, డిప్యూ టీ కమిషనర్లు ఎంఎన్‌ఆర్ జ్యోతి, సుధీర్ సింగ్,చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్, సిటీ ప్లానర్ సత్యభామ, అసిస్టెంట్ సిటీప్లానర్లు సాయిబాబా,పవని, కృష్ణ కుమారి,టౌన్ ప్లానింగ్ సిబ్బంది, పోలీస్ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

రాజేంద్రనగర్ ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు

రాజేంద్రనగర్ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ పరిధిలోని ఫుట్ పాత్ లపై రాజేంద్రనగర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ అధికారులు ఉక్కు పాదం మోపారు. గత కొన్ని ఏళ్లుగా ఫుట్ పాత్ లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తూ ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్న వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించబమని డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి తెలిపారు శనివారం రాజేంద్రనగర్ టిప్పు కాన్ బ్రిడ్జి నుండి కాళీ మందిర్ సన్ సిటీ టీ ఎస్ పి ఎ జంక్షన్ వరకు ఫూట్ పాత్ లపై వెలసిన ఆక్రమణలను అధికారులు జెసిబి సహాయంతో తొలగించామని డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి తెలిపారు.

ఇందులో భాగంగా శనివారం ఉదయం నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య పుట్పాత్పే ఉన్న అక్రమాలను తొలగించడం ప్రారంభించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని టిప్పుఖాన్ బ్రిడ్జ్ నుంచి సన్ సిటీ, బండ్లగూడ, కార్మికనగర్, అప్పా జంక్షన్ వరకు రహదారికి ఇరు వైపులా పుట్పాత్లపై ఉన్న టీ స్టాళ్లు, కొబ్బరి బొండాల షాపులతో పాటు సైన్ బోర్డులను అధికారులు జేసీబీల సహాయంతో దాదాపు 50 నుండి 60 తొలగించారు. ప్రజల సౌక ర్యం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి తెలిపారు. తొలగించిన చోట ఆక్రమణలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారు లు హెచ్చరించారు.