14 March, 2026 | 1:06 AM

వంటింట్లో ‘గ్యాస్’ మంట

14-03-2026 12:00 AM

మధ్యతరగతి జేబులకు చిల్లు 

సరిపడా నిల్వలు ఉన్నాయి

వదంతులు నమ్మొద్దు: కలెక్టర్ 

రంగారెడ్డి, మార్చి 13(విజయక్రాంతి): పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు రంగారెడ్డి జిల్లాలోని సామాన్యుడి పొయ్యిని చల్లారుస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్ను కుదిపేయడంతో, ఆ ప్రభావం నేరుగా మన జిల్లా గ్యాస్ సిలిండర్లపై పడింది. ఒక్కసారిగా పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి వర్గాలు ఆందోళనలో మునిగిపోయాయి.

రూ. 60 పెరిగిన డొమెస్టిక్ సిలిండర్.గృహ అవసరాలకు వాడే 14.2 కేజీల సిలిండర్ ధరపై కేంద్రం మరియు చమురు సంస్థలు ఏకంగా రూ. 60 పెంచాయి. నిన్నటి వరకు రూ. 905 గా ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 965 కు చేరుకుంది. జిల్లాలో సుమారు 12.81 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఈ పెంపుతో వినియోగదారుల బడ్జెట్ తలకిందులవుతోంది. రంగారెడ్డి జిల్లాలో పట్టణ జనాభా ఎక్కువగా ఉండటం వల్ల రాష్ట్రంలోనే అత్యధిక గ్యాస్ కనెక్షన్లు ఉన్న జిల్లాల్లో ఇది ఒకటి. జిల్లాలో సుమారు 12 లక్షల నుండి 14 లక్షల వరకు డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. జిల్లాలో ’మహాలక్ష్మి పథకం’ (రూ. 500 కే గ్యాస్) కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 4 లక్షల నుండి 5 లక్షల వరకు ఉంటాయి.

ఇటీవల పెరిగిన ధరలను ఒకసారి పరిశీలిస్తే జిల్లాపై నెలవారీ అదనపు భారం రూ. 7 కోట్ల పైగా పడుతుందని జిల్లా సరఫరాల శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. అందులో వాణిజ్య సిలిండర్ల పరిస్థితి మరింత దారుణం గా ఉంది.వ్యాపార అవసరాల కోసం వాడే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 115 పెరిగింది. దీనివల్ల హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, చిన్న తరహా పరిశ్రమల నిర్వహణ భారంగా మారింది. ఈ ప్రభావం హోటల్ ధరలపై కూడా పడే అవకాశం ఉండటంతో సామాన్యుడి బయటి తిండి కూడా ప్రియం కానుంది. ఇదే అదును గా భావించే మరికొందరు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్  తరలించి తమ జేబులు నింపుకునే పనుల్లో పడ్డారు. 

ట్యాంక్ ఫుల్’ కోసం పోటీ....

యుద్ధం కారణంగా చమురు సరఫరా నిలిచిపోతుందనే భయం వాహనదారులను కలవరపెడుతోంది. దీంతో రంగారెడ్డి జిల్లాలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. యుద్ధం ఇంకా ఇలానే కొనసాగితే రేపు ధరలు ఇంకా పెరుగుతాయేమో అన్న భయంతో చాలామంది వాహనాల ట్యాంకులను ఫుల్ చేయిస్తున్నారు. మారికొందరు వినియోగదారులు ప్లాస్టిక్ క్యాన్లలో పెట్రోల్, డీజిల్ను నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటం జిల్లాలో ఇంధన కొరత భయాన్ని ప్రతిబింబిస్తోంది.

ఎందుకీ సెగ?

అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఇర్పా దాడులు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. రవాణా మార్గాల్లో ఆంక్షలు, దిగుమతులు నిలిచిపోవడంతో దేశీయ చమురు సంస్థలు ధరలను సవరించక తప్పలేదు. అయితే, ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యుడికి ఈ భారమనేది ’గోరుచుట్టుపై రోకలిపోటు’ లాంటిదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వదంతులను నమ్మవద్దు

అమెరికా- యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. గతంలో లాగే గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణంగానే ఉంటుంది. బుకింగ్ చేసిన వారికి ఎలాంటి జాప్యం లేకుండా అందుతాయి.జిల్లాలో గృహ అవసరాలకు, ఆసుపత్రులు, వసతి గృహాలు మరియు ఆశ్రమాలకు అవసరమైన సరిపడా గ్యాస్ నిల్వలు అందుబా టులో ఉన్నాయి. ప్రజలు అవాస్తవాలను నమ్మి కంగారు పడాల్సిన అవసరం లేదని కలెక్టర్  నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

బడ్జెట్ తలకిందులైంది..

‘నెలకు రూ. 905 కట్టడమే కష్టమనుకుంటే, ఇప్పుడు ఒక్కసారిగా రూ. 965 అంటే సామాన్యులం ఎలా బతకాలి? కూరగాయల ధరలు ఇప్పటికే ఆకాశంలో ఉన్నాయి, ఇప్పుడు గ్యాస్ కూడా తోడైంది. నెలకు అదనంగా పడే ఈ భారం మా పిల్లల చదువులకో, ఇతర అవసరాలకో వాడాల్సిన డబ్బు. యుద్ధం ఎక్కడో జరిగితే మా కడుపు కొట్టడం ఏంటి అని ఆవేదన వ్యక్తం చేస్తుంది 

శ్యామలమ్మ, గృహిణి, అమనగల్లు 

హోటల్ నడపడం భారమే

వాణిజ్య సిలిండ్ప రూ. 115 పెంచడం అంటే మా లాంటి చిన్న హోటల్ నిర్వాహకులకు పెద్ద దెబ్బ. చాయ్, టిఫిన్ ధరలు పెంచితే కస్టమర్లు రారు.. పెంచకపోతే మాకు గిట్టుబాటు కాదు. జిల్లాలో రోజుకు 5,000 కమర్షియల్ సిలిండర్లు రీఫిల్ అవుతున్నాయి. ఈ పెంపుతో చిన్న వ్యాపారాలు మూతపడే పరిస్థితి వస్తుంది.‘

వెంకటేష్, హోటల్ యజమాని, షాద్‌నగర్

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి..

రేపు పెట్రోల్ దొరకదేమో అన్న భయంతో అందరూ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. సాధారణంగా రూ. 200 లీటర్లు పోయించుకునే నేను, ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాను. చమురు కొరత ఏర్పడుతుందన్న ప్రచారం మాలో ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధరలను నియంత్రించాలి.‘

రమేష్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, గచ్చిబౌలి