పర్యాటక కేంద్రంగా సరూర్‌నగర్ చెరువు
రూ, 24 కోట్లతో పునర్నిర్మాణ పనులు
టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి
ఉత్సాహంగా కొనసాగిన 3కే రన్ ర్యాలీ
హాజరైన ప్రజా గాయకుడు నల్గొండ గద్దర్ నర్సింహరెడ్డి, సినీ నటి పాయల్ రాధాకృష్ణన్, ఫిట్ నెస్ ట్రైనర్లు
ఎల్బీనగర్, మే 17: సరూర్ నగర్ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, ఇందుకు ప్రభుత్వం సుమారు రూ, 24 కోట్లు మంజూరు చేసినట్లు టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ కార్పొరేటర్, ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. లింగోజిగూడ డివిజన్ పరిధిలోని సరూర్ నగర్ చెరువు నుంచి ప్రియదర్శిని పార్కు వరకు ఆదివారం 3కే రన్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో స్థానిక ప్రజలు, విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, ప్రజా గాయకుడు నల్గొండ గద్దర్ నర్సింహరెడ్డి, సినీ నటి పాయల్ రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. రన్ ఫర్ రెనోవేషన్ ఆఫ్ సరూర్ నగర్ లేక్ నినాదంతో నిర్వహించిన భారీ 3కే రన్ కార్యక్రమంలో వేలాది మంది వాకర్స్, లేక్ లవర్స్, వివిధ కాలనీల ప్రజలు పాల్గొన్నారు. మూడు రోజులుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఆదివారం ఉదయం 6 గంటలకు సరూర్నగర్ చెరువు చుట్టూ 3కే రన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని సరూర్నగర్ చెరువును కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పునరుద్ధరిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఇప్పటికే సుమారు రూ.24 కోట్లతో చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని, అలాగే హైడ్రా సహకారంతో మరో రూ.88 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోద ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.
ప్రజలు చెల్లించే పన్నులతో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు ప్రత్యక్షంగా చూపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సరూర్ నగర్ చెరువు పరిరక్షణకు పార్టీలకు అతీతంగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. మురుగునీరు తొలిగించి, స్వచ్ఛమైన నీరు పారేలా పనులు చెపుతున్నట్లు తెలిపారు. సరూర్ నగర్ చెరువు పునర్నిర్మాణ పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలంతా చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మూడు నెలల్లో జరగనున్న వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఉపయోగించకుండా, పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించి చెరువులో నిమర్జనం చేయాలని అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. 3కే రన్ లో సినీ నటి పాయల్ రాధాకృష్ణన్, ఫిట్ నెస్ ట్రైనర్ మౌనిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నల్గొండ గద్దర్ నర్సింహరెడ్డి తన పాటలతో అందరినీ ఉత్సాహపరిచారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు.
సర్వ మతాల సమ్మేళనం అందరూ మా వాళ్లే, అందరి అభివృద్ధే మా లక్ష్యం అనే భావనతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని దర్పల్లి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామిరెడ్డి, కల్వ సుజాత, అన్వేష్ రెడ్డి, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో తదితరులు పాల్గొన్నారు.






