14 May, 2026 | 3:43 PM

గల్లీకో బెల్ట్‌షాపు

01-09-2025 12:31 AM

-మూడు సీసాలు ఆరు గ్లాసులు

-రెచ్చిపోతున్న మద్యం మాఫియా

-అధిక ధరలతో జనం జేబులకు చిల్లు

-బార్‌లను తలపిస్తున్న బెల్ట్‌లు

-పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

మంగపేట,ఆగస్టు31(విజయ క్రాంతి ): మందేస్తూ చిందేరా చిందేస్తూ మందేరా చుక్కల్లో పక్కేరా బెల్ట్ షాపులో చుక్కేరా అన్న రీతిలో ఉంది మన ‘మంగపేట మండలం‘ లోని ప్రతి గ్రామంలో గల్లీకి ఒక బెల్ట్ షాపూలు దర్శనమిస్తున్నాయి. ఊరువాడ అనే తేడా లేకుండా పాన్ షాపు కిరణా దుకాణల మాటున బెల్ట్ దుకాణాలకు తెరలేపుతున్నారు.

పల్లెల్లో మద్యం ఏరులై పారుతుంది నాసిరకం మందును విక్రయిస్తూ అధిక ధరలతో జనం జేబులకు చిల్లు పెడుతున్నారు. గ్రామాల్లోని బెల్ట్ షాపులు వైన్స్ బార్ లను తలపిస్తున్నాయి బెల్ట్ దుకాణాలు నిత్యం మూడు సీసాలు ఆరు గ్లాసులగా రాత్రి పగలు అని తేడా లేకుండా ఒక్కొక్క సీసాకు అధికంగా రూ 30 నుంచి రూ 50 రూపాయలు వసూలు చేస్తూ మద్యం మాఫియాని కొనసాగిస్తున్నారు.

తాగుడుకు బానిసై అమానుషంగా ఇంట్లో ఉన్న సామాన్లు భార్య మెడలో పుస్తెలు (తాళి) తాకట్టు పెట్టి భార్య పిల్లలను రోడ్డుకు ఈడుస్తున్న ఘటనలను చూసి చలించి పోయిన మహిళలు అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంత తతంగం నడుస్తున్న పట్టించుకోని ఎక్సైజ్ అధికారులను ఏమనాలి అని స్థానిక మహిళలు అంటున్నారు.