గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
ఇందిరమ్మ ఇండ్లు, విద్యుత్, మిషన్ భగీరథ పనులపై ప్రత్యేక సమీక్ష
ఊర్కొండ: మండల పరిధిలోని రాచాలపల్లి, రేవల్లి, గుడిగానిపల్లి గ్రామాలలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి(Jadcherla MLA Janampalli Anirudh Reddy), జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం విస్తృతంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ తాగునీటి సదుపాయాలు, అంతర్గత రహదారులు, పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
గ్రామాల సమగ్ర అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై స్థానిక ప్రజలు, గ్రామ పెద్దల అభిప్రాయాలను సేకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హులకూ పూర్తిస్థాయిలో అందేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. గ్రామీణాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రజల అవసరాలను గుర్తించి ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






