14 May, 2026 | 4:26 PM

కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసు ఛేదన

14-05-2026 03:14 PM

ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్.. 

“ది గోల్డెన్ థీఫ్” సుభోద్ సింగ్ మాస్టర్‌మైండ్‌గా గుర్తింపు

కరీంనగర్,మే14(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. బీహార్, పశ్చిమ బెంగాల్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కేసు వివరాలను వెల్లడించారు.

ఈ నెల 3వ తేదీన కరీంనగర్ 2-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఎంజే జ్యువెలరీ షాపులో ఐదుగురు దుండగులు తుపాకులతో చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అడ్డువచ్చిన నలుగురు ఉద్యోగులు గాయపడగా, దుండగులు సుమారు రూ.82.02 లక్షల విలువైన 161.4 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాభరణాలను దోచుకెళ్లారు. ఈ దోపిడీకి బీహార్ జైలులో ఉన్న అంతర్రాష్ట్ర గ్యాంగ్ హ్యాండ్లర్ “ది గోల్డెన్ థీఫ్”గా పేరొందిన సుభోద్ సింగ్ సూత్రధారిగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలిందని సీపీ తెలిపారు. అతని సూచనల మేరకు రఘునాథ్ కర్మాకర్ నేతృత్వంలోని ముఠా రెండు నెలల ముందుగానే తెలంగాణకు చేరుకుని ఖమ్మం, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లోని బ్యాంకులు, జ్యువెలరీ షాపులపై రేక్కీ నిర్వహించినట్లు వెల్లడించారు.

సాంకేతిక నిఘా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి బుధవారం వెలిచాల ఎక్స్‌రోడ్ వద్ద ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరా సింగ్‌ను అదుపులోకి తీసుకున్నాయి. మిగిలిన ఇద్దరు నిందితులు రవీష్ కుమార్, మెహతాబ్ ఖాన్లను బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలించారు.నిందితుల వద్ద నుంచి రూ.51 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.దోపిడీ కోసం నిందితులు మహారాష్ట్రలోని గడ్‌చందూర్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఆరు పిస్టల్స్, మ్యాగజైన్లను సేకరించినట్లు విచారణలో వెల్లడైంది. నకిలీ ఆధార్ కార్డులతో లాడ్జీల్లో బస చేయడంతో పాటు, ఒక్కో సిమ్ కార్డును రూ.10 వేల చొప్పున కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దోపిడీ అనంతరం బైక్ నంబర్ ప్లేట్లు మార్చి, కొందరు గోదావరి నది దాటి, మరికొందరు అడవి మార్గంలో కార్ల ద్వారా పరారైనట్లు తెలిపారు.

ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 13 మంది నిందితులను గుర్తించినట్లు సీపీ వెల్లడించారు. పరారీలో ఉన్న గ్యాంగ్ లీడర్ సుభోద్ సింగ్‌తో పాటు మరో 10 మంది కోసం ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. నిందితులపై వివిధ రాష్ట్రాల్లో హత్యలు, దోపిడీలు, ఆయుధ చట్టం కింద అనేక కేసులు నమోదై ఉన్నట్లు వివరించారు. వ్యాపార సంస్థలు, బ్యాంకులు, లాడ్జీల యజమానులు నాణ్యమైన సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీపీ సూచించారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు.