14 May, 2026 | 2:35 PM

యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

01-09-2025 12:33 AM

-అధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం శూన్యం

-వెనకేసుకొస్తున్న అధికారులు

రామకృష్ణాపూర్, ఆగస్టు 31: కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో మట్టి మాఫియా తవ్వకాలు మూడు పువ్వులు.., ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటూ చూసీ చూడనట్టుగా వ్యవహరించడమే మాఫియా కు కలిసివస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వివరాల్లోకి వెళితే... క్యాతన్ పల్లి రైల్వే గేటుపై నిర్మించిన బ్రిడ్జ్ పనుల నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన యాష్, మట్టిని నిల్వ చేసుకునేందుకు గుత్తేదారుడికి అధికారులు క్యాతన్ పల్లి నర్సరీ దగ్గర గల ప్రభుత్వ స్థలన్ని అప్పగించారు. క్యాతన్ పల్లి రైల్వే గేటు బ్రిడ్జ్ పనులు గత కొద్ది నెలల కిందట ముగిసింది.

అక్కడ మిగిలి ఉన్న యాష్ ను ఇతర పని జరిగే ప్రాంతాలకు తీసుకువెళ్లే క్రమంలో యాష్ తో పాటుసదరు గుత్తేదారుడు నిలువ ఉంచిన ప్రభుత్వ స్థలంలో యంత్రాల సహాయంతో తవ్వకాలు జరుపుతూ రాత్రి, పగలు అనే తేడా లేకుండా ప్రతి రోజు బహిరంగంగా టిప్పర్ల సహాయంతో మట్టిని ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నారని శేషుపల్లి, క్యాతన్ పల్లి గ్రామ స్తులు వాపోతున్నారు.

మున్సిపాలిటీ నర్సరీ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. సాధారణంగా మట్టి తవ్వకాలకు మైనింగ్ అనుమ తులు తీసుకోవాలి కానీ, ఇక్కడ మాత్రం ప్రభుత్వ అనుమతులు లేకుండా దర్జాగా మట్టి దందా యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు మాత్రం తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నట్లు స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.

పట్టించుకోని అధికారులు...

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఇంత పెద్ద ఎత్తున మట్టిని తవ్వకాలు జరుపుతూ బహిరంగంగానే లారీల ద్వారా తరలిస్తున్నా రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఈ తవ్వకాలను ఎక్కువగా ప్రభుత్వ భూముల్లోనే జరుపుతున్నా అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. తవ్విన మట్టిని కొందరు టిప్పర్లు, ట్రాక్టర్లు ద్వారా తరలిస్తున్నారు. అయిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోక పోవడంపై పలు అనుమలకు తావిస్తున్నాయి. 

ఈ మట్టి తవ్వకాలపై మందమర్రి తహశీల్దార్ సత్యనారాయణను వివరణ కోరగా.. ఆ స్థలంలో కేవలం మిగిలిన యాష్‌ను మాత్ర మే గుత్తేదారుడు తీసుకొని వెళ్తున్నారని, అంతే కాని మట్టి తవ్వకాలు జరగడం లేదనడం గమనార్హం.