10 March, 2026 | 9:55 PM

‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్

09-03-2026 02:58 AM
  1. దేశంలో రోల్ మోడల్‌గా తెలంగాణ
  2. సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘ట్రిపుల్ టీ’ వ్యూహం
  3. ‘తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): ‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలపాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పోలీసింగ్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేం దుకు ‘ట్రిపుల్ టీ’(టెక్నాలజీ, ట్రస్ట్, టాలెంట్ ) వ్యూహంతో ముందుకెళ్తున్నామన్నారు.

ఆదివారం ఆర్బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో పోలీస్ ఉన్నతాధికారులకు ‘తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026’ పేరిట నిర్వహించిన ప్రత్యేక కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఒకప్పుడు పోలీసింగ్ అంటే కేవలం శాంతి భద్రతల పరిరక్షణ మాత్రమే, ఇప్పుడు డేటా సెక్యూరిటీ, డిజిటల్ ట్రస్ట్‌గా రూపాంతరం చెందిందన్నారు. డీప్ ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, ఆటోమేటెడ్ ఫిషింగ్ స్కామ్లు పోలీసులకు పెను సవాల్‌గా మారాయన్నారు.

ప్రస్తుతం నేరగాళ్లకు ఆయుధాలతో పనిలేదని, స్మార్ట్ ఫోన్, డేటా, డిజిటల్ ఐడెంటిటీస్‌తో నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఒక్క 2024లో దేశవ్యా ప్తంగా సైబర్ నేరగాళ్లు రూ.22,845 కోట్లు  కొల్లగొట్టారని, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 206 శాతం ఎక్కువన్నారు. సైబర్ బాధితుల్లో నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులే అధికంగా ఉంటున్నారని ఆందోళ న వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రొఫెషనలిజం, ఆపరేషనల్ రెడీనెస్, లీడర్షిప్, ఇన్నోవేషన్, కొలాబరేషన్ , ఎథిక్స్‌తో కూడిన ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ ఆవశ్యకమన్నారు. ఇప్పటికే టెక్నాలజీ ఎనేబుల్ పోలీసింగ్‌లో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు.

రాబోయే రోజుల్లో డేటా అనలిటిక్స్, ఏఐ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ సాయంతో నేరాల జరగకముందే అడ్డుకునే ‘ప్రెడిక్టివ్ పోలీసింగ్’కు పెద్దపీట వేస్తామన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో పోలీసుల పాత్ర కీలకమని చెప్పారు. నక్సలిజంపై పోరాటంలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు స్మరించుకున్నారు. కార్యక్రమంలో డీజీపీ శివధర్‌రెడ్డి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష భిష్త్, రిటైర్డ్ డీజీపీలు హెచ్‌జే దొర, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.