కాలువ పనులకు నిధులు మంజూరు
– ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఘన స్వాగతం
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ఎక్స్ రోడ్ వద్ద మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణకు మండల కాంగ్రెస్ నాయకులు, రైతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు 11వ ప్యాకేజీ పరిధిలోని LM-4, LM-6 కాల్వల పెండింగ్ పనులకు రూ.3.19 కోట్ల నిధులు మంజూరు కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వంలో రైతుల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జె.టోనీ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు కలిసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన కాల్వ పనులు ఇప్పుడు ప్రారంభం కానుండటంతో రైతులకు శాశ్వత పరిష్కారం లభించనుందని ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్, సీనియర్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.




