05-02-2026 12:00:00 AM
కలెక్టర్ బి.యం సంతోష్
అలంపూర్ ఫిబ్రవరి 4:మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల లెక్కింపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ అధికారులను ఆదేశించారు.ఆలంపూర్ మున్సిపాలిటీలో జరుగనున్న ఎన్నికల సందర్భంగా పోలింగ్ సామాగ్రి పంపిణీ,రిసెప్షన్ కేంద్రం,స్ట్రాంగ్ రూమ్,లెక్కింపు కేంద్రాలుగా అలంపూర్ లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎంపిక చేశారు.
ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేందుకు వార్డు వారీగా తగిన సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.పోలింగ్ విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన వసతులు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రంగా నిల్వ చేసే స్ట్రాంగ్ రూమ్లో భద్రతా చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. లెక్కింపు నిర్వహించనున్న హాళ్లను పరిశీలించిన కలెక్టర్, వార్డు వారీగా రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో లెక్కింపు జరగాలని ఆదేశించారు.
కౌంటింగ్ హాళ్లలో టేబుల్స్ , సూపర్వైజర్లు మరియు ఇతర సిబ్బంది నియామకంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జెడ్పి డిప్యూటీ సీఈవో నాగేంద్రం, ఇరిగేషన్ ఎస్‌ఈ రహీముద్దీన్, తహసీల్దార్ మంజుల, మున్సిపల్ కమిషనర్ శంకర్ ఈఈ శ్రీనివాసరావు, తదితర అధికారులు పాల్గొన్నారు.