22-02-2026 02:02:46 AM
1,100 ఫైళ్లు దగ్ధం
50 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు ధ్వంసం
డేటా రికవరీ అసాధ్యమని తేల్చిన నాగ్‌పూర్ టీమ్
కీలక కేసుల ఆధారాలు బూడిద
నేర పరిశోధనపై తీవ్ర ప్రభావం
హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): నాంపల్లిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్‌ఎస్‌ఎల్)లో జరిగిన అగ్నిప్రమాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. ఈ ప్రమాదంలో జరిగిన నష్టంపై దర్యాప్తు చేసిన నాగ్‌పూర్ ప్రత్యేక నిపుణుల బృందం దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది.
ల్యాబ్‌లో మంటలు చెలరేగిన సమ యంలో మొత్తం 1,100 కీలక ఫైళ్లు కాలి బూడిదయ్యాయని ఆ బృందం తన నివేదికలో స్ప ష్టంచేసింది. అత్యంత విషాదకరమైన అంశం ఏమిటంటే.. దగ్ధమైన ఈ డేటాను తిరిగి రికవరీ చేయడం సాధ్యం కాదని నిపుణులు తేల్చిచె ప్పారు. దీంతో అనేక కీలక నేర పరిశోధనల్లో శాస్త్రీయ ఆధారాలు శాశ్వతంగా గల్లంతైనట్లయ్యింది.
ఫోన్ ట్యాపింగ్ కేసుకూ ముప్పు..
ఫిబ్రవరి 7న ఎఫ్‌ఎస్‌ఎల్ భవనం మొదటి అంతస్తులో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 50 కంప్యూటర్లతో పాటు, వివిధ తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించి సీజ్ చేసిన హార్డ్ డిస్కులు పూర్తిగా కాలిపోయాయి. నాగ్‌పూర్ స్పెషల్ టీమ్ రిపోర్టు ప్రకారం.. రాష్ర్టంలో రాజకీయ ప్రకంపనలు సష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అత్యంత కీలకమైన శాస్త్రీయ ఆధారాలు కూడా ఈ అగ్నిప్రమాదంలో కాలి బూడిదైనట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ల్యాబ్‌లో భద్రపరిచిన డిజిటల్ సాక్ష్యా లు గల్లంతవ్వడం దర్యాప్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
రాష్ర్టంలో జరిగే ప్రతి ప్రధాన నేర పరిశోధనలో ఎఫ్‌ఎస్‌ఎల్ కీలక పాత్ర పోషిస్తుంది. హత్యలు, దోపిడీలు, లైంగిక దాడులు, డ్రగ్స్ మాఫియా భారీ మోసాలకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ ఇక్కడే నిక్షిప్తమై ఉంటాయి.
ఘటనాస్థలాల నుంచి సేక రించిన ఫింగర్ ప్రింట్స్, రక్తం, జుట్టు నమూనాలు, డీఎన్‌ఏ టెస్టులు, తుపాకులు, బుల్లెట్ల ఫోరెన్సిక్ నివేదికలు ఇక్కడే తయారవుతాయి. అలాగే విషప్రయోగాలు, గంజాయి, హెరాయిన్ వంటి మత్తు పదార్థాల నమూనాలతో పాటు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాల పరిశీలన కూడా ఈ ల్యాబ్‌లోనే జరుగుతుంది. ఇప్పుడు 1,100 ఫైళ్లు హార్డ్ డిస్కులు కాలిపోవడంతో, విచారణలో ఉన్న వందలాది కేసుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
రికవరీ అసాధ్యం..
దగ్ధమైన ఫైళ్లను రికవరీ చేసేందుకు నాగ్‌పూర్ బృందం అన్ని విధాలా ప్రయత్నించిన ప్పటికీ, సాంకేతికంగా అది సాధ్యంకాదని తేలిపోయింది.హార్డ్ డిస్కులు
స్టోరేజ్ పరికరాలు మంటల వేడికి పూర్తిగా కరిగిపోవడంతో డేటా రికవరీ చేసే అవకాశం లేదని వారు నివేదికలో పేర్కొన్నారు. ఈ 1,100 ఫైళ్లలో ఏయే కేసులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.. ఎంత మంది నేరస్తులకు దీనివల్ల లబ్ధి చేకూరుతుంది.. అనే అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సిఉంది.
కీలకమైన సాక్ష్యాలు మాయమవ్వడం వెనుక ఏదైనా కుట్ర ఉందా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా.. అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేర పరిశోధనలో శాస్త్రీయ ఆధారాలే కీలకంగా మారిన తరుణంలో, ఈ డేటా గల్లంతు కావడం పోలీస్ యంత్రాంగానికి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు.