calender_icon.png 22 February, 2026 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురపోరులో విజేతలైన బీసీ బిడ్డలు

22-02-2026 01:26:03 AM

పోటీని తట్టుకొని నిలిచి ఎన్నికల్లో గెలుపు

కార్పొరేషన్ మేయర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, వైఎస్ చైర్మన్లుగా ఎన్నిక

రాజకీయాలకతీతంగా అభివృద్ధికి కృషి చేస్తా

కాగజ్‌నగర్ పురపాలక వైస్‌చైర్మన్ డాక్టర్ అనిత

కాగజ్నగర్ పారిశ్రామిక ప్రాంతంలో డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ అనిత దంపతులు వైద్య వృత్తిలో కొనసాగుతూ ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రజలకు మరింతగా సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారు బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డు నుంచి డాక్టర్ అనిత కౌన్సిలర్‌గా గెలుపొందారు. వైస్‌చైర్మన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరిణామాల మధ్య టాస్ ద్వారా డాక్టర్ అనిత విజయం సాధించారు. రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

ప్రజాసేవలో ఉంటా

సుల్తానాబాద్ వైస్‌చైర్ పర్సన్ అంతటి పుష్పలత

పెద్దపల్లి, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మునిసిపల్ వైస్‌చైర్ పర్సన్‌గా బీసీ(గౌడ్) సామాజికివర్గానికి చెందిన అంతటి పుష్పలత ఎన్నికయ్యారు. ఆమె భర్త అంతటి అన్నయ్య గౌడ్ జిల్లా గ్రంథలయ చైర్మన్‌గా ఉన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సాకారంతో సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నిరంతరం ప్రజాసేవలో ఉంటాను. గతంలో సర్పంచ్‌గా ఎంతో అభివృద్ధి చేశాను. మరింత అభివృద్ధికి కృషి చేస్తానని  అంతటి పుష్పలత తెలిపారు. 

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చేస్తా

ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వేముల నాగలక్ష్మి

ధర్మపురి, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీసీ (పద్మశాలి)సామాజికవర్గానికి చెందిన వేముల నాగలక్ష్మి ఎన్నికయ్యారు. ఉన్నత విద్యావంతురాలైన వేముల నాగలక్ష్మి కస్తూర్బా గాంధీ పాఠశాలలో 10సంవత్సరాలు ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలుగా సేవలందించారు. ఊహించని రీతిలో భర్త వేముల రాజేష్ ప్రోత్సాహం తో రాజకీయ అరంగ్రేటం చేశారు. వేముల నాగలక్ష్మి మున్సిపల్ ధర్మపురి కౌన్సిలర్‌గా ఎన్నికై, ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ప్రస్తుతం ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె రానున్న వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు సత్వర చర్యలు చేపట్టారు. డ్రైనేజీ నీటి శుద్ధీకరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు ఆమె పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో, ఆయా శాఖల అధికారులను సమన్వయపరుస్తూ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. 

కాంగ్రెస్‌ను నమ్మినందుకు చైర్‌పర్సన్ పదవి

కోరుట్ల మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్

కోరుట్ల, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): కోరుట్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీసీ గౌడ్ సామాజికవర్గం నుంచి తిరుమల వసంత గంగాధర్ ఎన్నికయ్యారు. ఈమె రెండోసారి కౌన్సిలర్‌గా విజయం సాధించారు. బీఆర్‌ఎస్ పాలనలో కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. పార్టీని నమ్ముకున్నందుకు చైర్మన్ పదవి దక్కిందని ఆమె తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు జువ్వాడి రత్నాకర్‌రావు ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోరుట్ల టౌన్ ప్రెసిడెంట్‌గా పది సంవత్సరాల నుంచి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని నమ్ముకొని తిరుమల వసంత గంగాధర్ అహర్నిశలు కృషిచేశారు.

అవినీతి రహిత సేవలు అందిస్తా

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణిశ్రీనివాస్ 

జగిత్యాల, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): ప్రజలకు అవినీతి రహిత సేవలు అందిస్తానని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణిశ్రీనివాస్ తెలిపారు. ఈమె భర్త కుటుంబీకులు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నారు.

జగిత్యాల పట్టణంలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు అవినీతి రహిత సేవలకు ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. రహదారులు, మురుగు కాల్వలు, పారిశుధ్యం, తాగు నీటి సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యం గా ముందుకెళ్తానన్నారు. జగిత్యాలలో దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. 

రెండోసారి అరుదైన అవకాశం

కాగజ్నగర్ మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా, బీసీ (మైనారిటీ)

కాగజ్నగర్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా షాహిన్ సుల్తానాకు రెండోసారి అరుదైన రాజకీయ అవకాశం లభించింది. తైబానగర్‌కు చెందిన ఆమె గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌గా గెలిచి, అవిశ్వాస తీర్మానం అనంతరం ఏడాది పాటు చైర్‌పర్సన్‌గా కొనసాగారు.

తాజాగా జరిగిన ఎన్నికల్లో 18వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. బీసీ మహిళకు చైర్‌పర్సన్ పదవి కేటాయించడంతో పాటు, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు, ఎక్స్‌ఆఫీషియో సభ్యుల మద్దతుతో ఆమె ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని, ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తామని షాహిన్ సుల్తానా తెలిపారు.

సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధికి కృషిచేస్తా

సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా పద్మశాలి

సిరిసిల్ల, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధికి కృషిచేస్తానని  సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన జిందం కళా పద్మశాలి తెలిపారు. చేనేత కార్మికురాలు నుంచి చైర్‌పర్సన్‌గా ఎదిగానని పేర్కొన్నారు. అందిరినీ సమన్వయం చేసుకుని, ప్రజలను భాగస్వాములను చేయిస్తూ  సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధికి ముందుకు సాగుతామని తెలిపారు.