ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ
జాష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ
జుక్కల్, ఆగస్టు 26 (విజయక్రాంతి): జాష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని జుక్కల్ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి రోగులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు పండ్లు అందజేసి, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన ప్రేమ, దయ, సేవాభావం, మానవత్వం, సోదరభావం వంటి విలువలను ప్రజల్లో మరింతగా పెంపొందించేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఉపసర్పంచ్ షైక్ ఫిర్దోస్, యూత్, ముస్లిం సోదరులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






