26 August, 2026 | 8:31 PM

బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి అరెస్టు

26-08-2026 07:41 PM

- ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుచ్లాపూర్ గ్రామానికి చెందిన వీఢీసీ (VDC) సభ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయిస్తానంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన బట్టు నరేష్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా బుధ వారం తెలిపారు.

సీఐ తెలిపిన వివరాల ప్రకారం... 2025, డిసెంబర్ నెలలో బట్టు నరేష్ కుచ్లాపూర్ గ్రామానికి వచ్చి వీఢీసీ సభ్యులు రూ. 40 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో తోట శ్రీనివాస్ పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే వీఢీసీ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయిస్తానని, పత్రికల్లో వ్యాసాలు రాస్తానని, బ్లాక్మెయిలింగ్ తో బెదిరించడంతో భయపడి, రూ.20 వేలు నరేష్‌కు చెల్లించినట్లు తెలిపారు.

2026, జనవరిలో వీఢీసీ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో, తాము ఇచ్చిన రూ. 20 వేలు తిరిగి ఇవ్వాలని నరేష్‌ను ప్రశ్నించగా, ఇప్పటికే కేసు నమోదైనందున ఇకపై ఎలాంటి కేసులు నమోదు కాకుండా చూస్తానని నరేష్ చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు హామీలతో డబ్బులు తీసుకుని తమను మోసం చేశాడని బాధితుడు శ్రీనివాస్ తలమడుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడని, ఎస్ఐ రాధిక దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.