జగిత్యాల జైత్రయాత్ర నుంచి నక్సల్స్ ఉద్యమం వరకు
- ఉమ్మడి కరీంనగర్ ది కీలకపాత్ర
ముగిసిన డెడ్ లైన్
ముప్పాలపై కొనసాగుతున్న సస్పెన్స్
కరీంనగర్, ఏప్రిల్01 (విజయ క్రాంతి): తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు సంబంధించిన ప్రస్థానం వస్తే జగిత్యాల జైత్రయాత్ర ప్రధాన భూమి పోషించింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో విప్లవోద్యమాలకు ఈ జైత్రయాత్ర నాంది పలికింది. ఎలాంటి సమా చార వ్యవస్థ అందుబాటులో లేని కాలంలో కేవలం మాటల ద్వారా విషయం తెలుసుకుని లక్షలాది మంది ఒక చోట చేరి ఉద్య మించడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. 1978 సెప్టెంబర్ 9న రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభకు ఊరు ఊరంతా కదలివచ్చారు.
భూస్వాములు, పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ లక్షలాది గొంతుకలు గర్జించడంతో జగిత్యాల పట్టణం దద్దరిల్లింది. 150 గ్రామాల నుంచి కాలినడకన గొంగడి భుజాన వేసుకుని, సద్ది మూట కట్టుకుని ఈ జైత్ర యాత్రకు తరలివచ్చారు. ఈ సభ విజయవంతం వెనుక మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణలు ప్రముఖ పాత్ర పోషించారు.
ఈ లాంగ్ మార్చ్ తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఆనాటి సభలో మావోయిస్టు మాజీ కార్యదర్శి, ప్రస్తుత సెంట్రల్ కమిటీ సభ్యుడు ముప్పాల లక్ష్మణ్ రావు, దివంగత మావోయిస్టు నాయకులు మల్లోజుల కోటేశ్వర్ రావు, నల్లా ఆది రెడ్డి,శీలం నరేష్, గద్దర్ తదికరుల ప్రసంగాలు విప్లవ స్ఫూర్తిని రగిలించాయి. ఈ జైత్రయాత్ర నుండే నక్సల్స్ ఉద్యమం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యాప్తి చెందింది. ఇక్కడి నుండి మావోయిస్టు కార్యదర్శిగా నాయకత్వం వహించిన ముప్పాల లక్ష్మణ్ రావు ఉద్యమాన్ని 20కి పైగా రాష్ట్రాలకు విస్తరించారు.
పీపుల్స్ వార్ పార్టీగా ఉన్న ఈ సంస్థ ముప్పాల బాద్యతలు స్వీకరించిన అనంతరం దేశంలోని వివిధ వామపక్ష ఉద్యమ సంస్థలను చేర్చుకుని సీపీఐ (ఎంఎల్) మావోయిస్టుగా రూపాంతరం చెందింది. అయితే మావోయిస్టుల హింసాత్మక సంఘటనలు పలు విమర్శలకు దారితీయడం, ఎన్ కౌంటర్ల సంఖ్య పెరగడంతో క్రమ క్రమంగా గత పదేళ్ల నుండి పతనావస్థకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఏరివేత ప్రారంభించి నక్సల్స్ లొంగిపోవాలని పిలుపునిచ్చి మార్చి31, 2026 డెడ్ లైన్ విధించింది. మంగళవారంతో మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ముగిసినట్లేనని అంటున్నారు.
ఇటీవల పార్టీ అగ్రనేతలు దేవ్ జీ, రాజిరెడ్డిలు లొంగిపోవడం ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇదే కరీంనగర్ ఉమ్మడి జిల్లా, ప్రస్తుత జగిత్యాల జిల్లా పరిధికి చెందిన మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పర్తి తిరుపతి లొంగిపోయారు. ఆయనే ఈ పార్టీకి చివరి ప్రధాన కార్యదర్శిగా చెప్పవచ్చు. మావోయిస్టు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్ రావు ఇదే జిల్లాకు చెందినవారు కాగా, చివరి వారు కూడా ఇదే జిల్లాకు చెందినవారు కావడం విశేషం. సంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత తిప్పర్తి తిరుపతి కొద్దిరోజులపాటు ఆ బాధ్యతలు నిర్వర్తించి తాజాగా లొంగిపోయారు.
అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్లు, అగ్ర నేతల్లో ఒక ముప్పాల లక్ష్మణ్ రావు తప్ప ఎవరు లేరని చెప్పాలి. గణపతిగా పిలవడమే అగ్రనేత ఇప్పటికే అనారోగ్యంతో విదేశాల్లో ఉన్నట్లు తెలిసింది. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముప్పాల లక్ష్మణరావు అనారోగ్యంతో ఉన్నట్లు తెలిసింది లొంగిపోవాలని సూచించారు.
అయితే డెడ్ లైన్ ముగిసినప్పటికి ముప్పాల లొంగిపోకపోవడంపై సర్వత్రా సస్పెన్స్ నెలకొంది. అటవీ హక్కుల చట్టం 2006 రావడంలో నక్సల్స్ ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే అభివృద్ధి కుంటుపడుతుందని ఆపరేషన్ కగార్ ప్రారంభించిన కేంద్రం ఉద్యమాన్ని అంతం చేసినందని చెప్పవచ్చు. దున్నేవాడికే భూమి నినాదంతో ఉద్యమాని ప్రారంభించిన నక్సలైట్ల 60 ఏళ్ల ప్రస్థానం ముగిసినట్లేనా, మరో రూపంలో విప్లవోద్యమాలు వస్తాయా చూడాలి.




